బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2023 నవంబర్‌ 30న మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆనాటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలంటూ సంజయ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతిస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ తీర్పు చెప్పారు. పోలీసులు సాక్షుల వాంగ్మూలాల సమర్పణలో విఫలమయ్యారని, సంజయ్‌పై కేసు చట్టవిరుద్ధమని తీర్పులో పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌కు ఊరట

హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సమయంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘించారంటూ బీజేపీ నేత, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్‌పై నమోదైన కేసులో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారని ఈటలపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ అనుమతిస్తూ తీర్పు చెప్పారు. బాణసంచా కాల్చినప్పుడు పిటిషనర్‌ సంఘటనా స్థలంలో లేరని, కేసు నమోదు ఎలా చేస్తారని తీర్పులో పేర్కొన్నారు. నాటి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *