బీఆర్‌ఎస్‌ ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది

-‌ స్పీకర్‌ ‌నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు
– తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య

న్యూదిల్లీ, మార్చి 12: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ ‌రెడ్డి, కేటీఆర్‌, ‌బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ‌గురువారం విచారణకు రాగా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ‌దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది . ఈ కేసును జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌, ‌జస్టిస్‌ అగస్టిన్‌ ‌జార్జ్ ‌మసీహ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం విచారించగా.. స్పీకర్‌ ‌తరఫున సీనియర్‌ ‌న్యాయవాది అభిషేక్‌ ‌మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్‌ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. దీంతో ఈ సమస్య సభాపతి కార్యాలయంలోనే ముగిసిందన్నారు. సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంపై స్పీకర్‌ ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నందున విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో కోర్టు విచారణ ముగిసినట్లేనని వెల్లడించింది. స్పీకర్‌ ఆదేశాలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత పిటిషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా నాలుగు రోజుల్లో అందజేయాలని సూచించింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు సభాపతి క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చిన‌ట్ల‌యింది. ఈ వ్యవహారంలో పదిమంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అయితే పోరాడిన బిఆర్‌ఎస్‌కు మాత్రం న్యాయం దక్కలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. స్పీకర్‌ ‌తీర్పుపై ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ‌తన నిరసన తెలియచేసింది. స్పీకర్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేస్తామన్న బిజెపికి కూడా ఈ తీర్పుతో ఇక అవకాశం లేనట్లుగానే భావించాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *