డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ

– తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా

హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 24 (ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర డీజీపీ శివధర్‌ ‌రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ ‌లిస్టును యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్‌ ‌లిస్టును యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల డీజీపీగా శివధర్‌ ‌రెడ్డిని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ ‌వర్కర్‌ ‌టి.మదన్‌ గోపాల్‌ ‌రావు హైకోర్టులో సవాల్‌ ‌చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018 నాటి సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌ ‌లైన్స్‌కు పూర్తి వ్యతిరేకమంటూ పిటిషనర్‌ ‌వ్యక్తిగతంగా హాజరై ఈ కేసును వాదించారు. డీజీపీ పదవి విరమణకు కనీసం మూడు నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ భర్తీ వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు. అర్హులైన ఐపీఎస్‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దాంతో శాశ్వత నియామక పక్రియ ఆగిందని వివరించారు. అనంతరం ఈ పిటిషన్‌పై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు నిరాకరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *