– ప్రాణాలు కాపాడిన మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: తీవ్ర కార్డియోజెనిక్ షాక్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అక్కడ సీపీఆర్ చేశారు, వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు, థ్రోంబోలిసిస్ చేశారు. అయినా ఆయన పరిస్థితి క్షీణించడంతో గుండెకు సరిపడ రక్తాన్ని పంపించలేని కార్డియోజెనిక్ షాక్‌లోకి వెళ్లిపోయారు. అతను కేర్ హాస్పిటల్స్‌కు వచ్చినప్పుడు రక్తపోటు చాలా తక్కువగా ఉండి, గుండె పంపింగ్ శక్తి (ఎజెక్షన్ ఫ్రాక్షన్) కేవలం 40% ఉన్నది. వెంటనే అత్యవసర కార్డియాక్ బృందం యాంజియోగ్రామ్ చేసింది. దాంతో, ఎడమ ప్రధాన కరోనరీ ఆర్టరీలో 70-80% వరకు అడ్డంకి ఉండటం, అలాగే ఎడమ పూర్వ అవరోహణ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించారు. ఇది ప్రాణాపాయ స్థితి కావడంతో తక్షణ చికిత్స అవసరమైంది. మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ చెరుకు అత్యవసర ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ ప్రధాన ధమనిలో ఉన్న అడ్డంకిని తొలగించి ఎడమ ప్రధాన కరోనరీ ధమనిలో స్టెంట్‌ను అమర్చారు. దీంతో రక్తప్రసరణ సవ్యంగా పునరుద్ధరణ జరిగింది. రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో ఐదు రోజులకే డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ రోగి వచ్చినప్పుడు అతను గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనుల్లో ఒకటైన ఎడమ ప్రధాన ధమనిలో తీవ్రమైన అడ్డంకితో కార్డియోజెనిక్ షాక్‌లో ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రతి నిమిషం ఆలస్యం గుండె మరింత దెబ్బతినడానికి లేదా ప్రాణహానికి కారణం కావచ్చు. గుండె ఇప్పటికే బలహీనంగా ఉండడంతో అలాంటి అస్థిర పరిస్థితుల్లో ఎడమ ప్రధాన ధమని యాంజియోప్లాస్టీ చేయడం చాలా క్లిష్టమైన పని. వేగంగా నిర్ణయం తీసుకోవడం, ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతతోపాటు తమ కార్డియాక్ బృందం సమన్వయంతో రక్త ప్రవాహాన్ని సమయానికి పునరుద్ధరించగలిగామన్నారు. వేగం, నైపుణ్యం, జట్టు కృషి ప్రాణాలను ఎలా కాపాడతాయో ఈ ఘటన నిరూపించిందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ విజయవంతంగా చేశామన్నారు. ఎడమ ప్రధాన ధమనిలో నుండి ఎడమ ప్రధాన ధమనికి స్టెంట్ ఉంచి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించామన్నారు. ప్రస్తుతం ఆయన ఫాలో-అప్ కేర్‌లో బాగా కోలుకుంటున్నాంని తెలిపారు. హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ క్లిష్టమైన గుండె అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఈ కేసు స్పష్టంగా చూపిస్తోందన్నారు. తమ వైద్యులు, క్యాథ్ ల్యాబ్ బృందం, అత్యవసర సిబ్బంది తక్షణ స్పందనకు ప్రత్యేక శిక్షణ పొందారని, నిమిషాల వ్యవధిలో తీసుకునే నిర్ణయం చాలాసార్లు జీవితం, మరణం మధ్య తేడాను నిర్ణయిస్తుందని తెలిపారు. సకాలంలో చికిత్స ఎంత ప్రాణరక్షకమో ఈ ఘటన ఒక మంచి ఉదాహరణ అన్నారు. ఈ ఘటన తీవ్రమైన ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, చెమట పట్టడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలనే అవసరాన్ని గుర్తు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎడమ ప్రధాన ధమని మూసుకుపోయే పరిస్థితుల్లో వేగంగా చికిత్స ప్రారంభించడం ప్రాణాపాయం నుంచి రక్షించే కీలక అంశంగా ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





