– ఈ హాస్పిటల్స్ గ్రూప్‌లో తొలిసారి నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 08: దక్షిణ భారతదేశంలో అత్యాధునిక గుండె చికిత్సలో అగ్రగామిగా పేరొందిన కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ మరో మైలురాయిని చేరుకుంది. 76 ఏళ్ల రోగి రంగారావు (పేరు మార్చబడింది) పై స్వదేశీ మైక్లిప్ (మెరిల్) పరికరంతో ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇది కేర్ హాస్పిటల్స్ గ్రూప్‌లో తొలి కేసు. అలాగే హైదరాబాద్‌లో కూడా అరుదైన విజయవంతమైన టీఈఆర్ కేసులలో ఇది ఒకటి. ఈ విజయంతో కేర్ హాస్పిటల్స్ క్లినికల్ ఆవిష్కరణలు, విశిష్టత పట్ల ఉన్న తన కట్టుబాటును మరోసారి రుజువు చేసింది. బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్ అండ్ కార్డియాలజీ హెడ్ డాక్టర్ వి. సూర్య ప్రకాశరావు నేతృత్వంలో వైద్య బృందం, స్వదేశీ మైక్లిప్ (మెరిల్) సాంకేతికతతో శస్త్రచికిత్స అవసరం లేకుండా ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానం విజయవంతంగా నిర్వహించింది. ఎకోకార్డియోగ్రాఫీ మార్గదర్శకత్వంలో మిట్రల్ వాల్వ్‌ను స్థిరంగా ఉంచేందుకు రెండు క్లిప్‌లను సక్రమంగా అమర్చారు. దీంతో మిట్రల్ రెగర్జిటేషన్ సమస్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రక్రియ తర్వాతే, రంగారావు మరుసటి రోజే చికిత్స పొందారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంలో, లక్షణాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించడంతో పాటు జీవన నాణ్యత కూడా గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వి. సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ, “ఈ రోగి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, శస్త్రచికిత్స కూడా సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో మేము ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) కోసం స్వదేశీ మైక్లిప్ (మెరిల్) టెక్నాలజీని ఉపయోగించాం. దీని ద్వారా రోగికి తక్కువ ఇన్వాసివ్ పద్ధతిలో, ప్రాణాలను కాపాడే పరిష్కారం ఇచ్చి, అతని జీవన నాణ్యతను మెరుగుపరచగలిగాం. ఈ విజయవంతమైన కేసు కేర్ హాస్పిటల్స్‌కే కాదు, దేశవ్యాప్తంగా గుండె చికిత్సలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది” అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, “ఇంత క్లిష్టమైన పరిస్థితిలో స్వదేశీ మైక్లిప్ పరికరాన్ని విజయవంతంగా వినియోగించడం మాకు గర్వకారణం. భారతీయ రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందించడమే కాకుండా, అది అందుబాటులో ఉండేలా చేయడం కేర్ హాస్పిటల్స్ లక్ష్యం. క్లినికల్ నైపుణ్యాన్ని ఆవిష్కరణలతో కలిపి, జీవితాలను మార్చే కొత్త చికిత్సలు అందించడంలో మేము ముందుంటాం” అని అన్నారు.