– బావిలోకి దూసుకెళ్లిన కారు
– ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి
ముంబై, ఏప్రిల్ 4:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని మృతుల బంధువులు తెలిపారు. నాసిక్ జిల్లా డిండోరీ తాలూకాలో ఈ ప్రమాదం జరిగింది. శివాజీ నగర్‌లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా వారిని మృత్యువు కబళించింది. నాసిక్ జిల్లాలోని డిండోరీ ప్రాంతానికి చెందిన సునీల్ దత్తాత్రేయ దర్గుడే (34) తన భార్య రేష్మా దర్గుడే (30), కుమార్తె రాఖీ అలియాస్ గుణవతి దర్గుడే, వదిన ఆశా దర్గుడే (32), ఆమె కుమారుడు శ్రేయాస్ దర్గుడే, కుమార్తె శ్రిష్టి దర్గుడేతో కలిసి కారులో శివాజీనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. వేసవి సెలవులు కావడంతో.. ఫంక్షన్ అనంతరం రేష్మా దర్గుడే మేరకోడళ్లు మాధురి, శ్రావణి.. అశా దర్గుడే మేన కోడలు సమృద్ధి కూడా వారితో ఇండోర్ కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో డిండోరీ తాలూకా కేంద్రంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. ఆ కారులో ఎనిమిది మృతదేహాలు ఉన్నాయి. కారు నుంచి బయటపడిన మరో బాలిక మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెతికి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో సునీల్ దత్తాత్రేయ దర్గుడే కారు నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రమాదంలో మరణించిన ఆరుగురు పిల్లలు 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారేని తెలిపారు. ఆ ఆరుగురిలో ఒకరు బాలుడు, ఐదుగురు బాలికలు ఉన్నట్లు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





