– మూడవ విడతపై ప్రత్యేక దృష్టి
(మండువ రవీందర్‌రావు)
ఇప్పటివరకు జరిగిన రెండు విడుతల పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన మేరకు పంచాయతీలను గెలుచుకోలేకపోయింది. చాలా వరకు ఒకటి రెండు నుంచి పది వోట్ల తేడాతో రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వొచ్చింది. దీంతో మూడవ, చివరిసారి జరిగే ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలనుకుంటున్నది. సుమారు పధ్నాలుగేళ్ళు అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌కు ఉంది. సాధించిన రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించడంతోపాటు, జనాదరణ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ గ్రామాల్లో ఆయనపట్ల ఇంకా విశ్వాసం ఉందనడానికి రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా భావిస్తున్నారు. సహజంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీకే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగింది. మొదటి రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. మొదటి విడతలో మొత్తం 4,230 స్థానాలకుగాను కాంగ్రెస్ 2,426 స్థానాలను గెలుచుకోగా బిఆర్‌ఎస్ 1,155 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే రెండవ విడత ఎన్నికల్లో 4,332 స్థానాలకు గాను కాంగ్రెస్ 2,331 స్థానాలను, బిఆర్‌ఎస్ 1,195 స్థానాలను గెలుచుకుంది. జూబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పని అయిపోయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఈ ఎన్నికలద్వారా బీఆర్‌ఎస్ తానే గట్టి ప్రత్యర్థినని చాటుకుంది. గ్రామీణ ప్రజల్లో ఇంకా కేసీఆర్‌పట్ల అభిమానం, నమ్మకం ఉందనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. కాంగ్రెస్ రెండేళ్ళ పాలనపైన పల్లె ప్రజల్లో వ్యతిరేకత మొదలైదనడానికి ఈ ఫలితాలే సమాధానం అంటున్నారు. మంత్రుల స్వంత నియోజకవర్గాల్లో తాము బలపర్చిన అభ్యర్థులు గెలవడం విశేషంగా వారు చెప్పుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఖమ్మంలో మేజర్ పంచాయతీలైన నేలకొండపల్లి, చెరవుమాదారం, రాజేశ్వరపురంలో తమ పార్టీ బలపర్చిన అభ్యర్దులు నెగ్గుకు రావడం కాంగ్రెస్ పాలనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని చెప్పకనే చెబుతుందంటున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో 71 పంచాయతీల్లో 30 పంచాయితీల్లో తమపార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయంసాధించారని ఈ విజయాలు కాంగ్రెస్ పాలనాతీరు ఫలితాలంటున్నారు. అయితే మూడవ విడత ఎన్నికల్లోకూడా తమకు అనుకూల ఫలితాలే వస్తాయన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న మూడవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబందించి సోమవారం సాయంత్రంతోనే ప్రచార కార్యక్రమాలకు తెరపడింది. మూడవ విడతలో మొత్తం 4,157 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 394 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఇక్కడ కూడా 11 పంచాయతీల్లో అభ్యర్ధులెవరూ పోటీకి ముందుకు రాలేదు. వీటిని మినహాయిస్తే 3,752 సర్పంచ్ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. అదేవిదంగా 26,434 వార్డులకుగాను 7916 వార్డులు ఏకగ్రీవమైనాయి. అలాగే 112 స్థానాల్లో నామినేషనే షన్లు దాఖలు కాలేదు. ఈ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటుకోవాలని అధికార ప్రతిపక్షాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





