“లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతా లన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు. నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.”
2019లో భారత ప్రభుత్వం లడఖ్‌కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగ రక్షణలను రద్దు చేసినప్పుడు, అభివృద్ధి, అవకాశాలు, సమీకరణ అనే వాగ్దానాలు చేసింది. కానీ ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది మాత్రం ఒక పరిచిత కథనే: పర్యావరణ సున్నితత్వాన్ని త్యాజ్యం గా చూడటం, స్థానిక సమ్మతిని అడ్డంకిగా భావించడం, ప్రజాస్వామ్యానికి బదులుగా సైనిక దళాలను ముందుకు తెచ్చింది. లడఖ్ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఖాలీ సరిహద్దు భూమి కాదు. ఇది హిమ నదులు, పురాతన వాణిజ్య మార్గాలు, తీవ్ర పరిస్థితుల్లో శతాబ్దాలుగా జీవనాన్ని నిలబెట్టిన స్థానిక జ్ఞాన వ్యవస్థలతో ఆకృతమై ఉన్న ఎత్తైన ఎడారి ప్రాంతం. అంతేకాదు, ఇది ఆసియాలో అత్యంత కీలకమైన నీటి నిల్వలలో ఒకటి. ఇక్కడి సీజనల్ మంచు నిల్వలు, హిమ నదులు సింధు, బ్రహ్మపుత్ర, గంగా నదులకు నీటిని అందిస్తాయి. వీటి మీద ఆధారపడి దాదాపు రెండు బిలియన్ ప్రజలు జీవిస్తున్నారు. ఈ భూభాగాన్ని అస్థిరం చేయడం కేవలం ప్రాంతీయ ప్రమాదం కాదు; ఖండ స్థాయి ప్రమాదం.
2019 తర్వాత లడఖ్‌లో “అభివృద్ధి” అంటే భూముల వేగవంతమైన ప్రైవేటీకరణ, ప్రపంచంలోనే అత్యంత వాతావరణ సున్నితమైన ప్రాంతాల్లో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విస్తరణ గా మారింది. బలహీనమైన శిలా నిర్మాణాల్లో ఉన్న ఖనిజాల కోసం గనుల ఒప్పందాలు ఇచ్చారు. తక్కువ ప్రజా సంప్రదింపులతో భూగర్భ తాప, సౌర విద్యుత్ ప్రాజెక్టులు ప్రకటించారు. భారత సౌర విద్యుత్ కార్పొరేషన్ ఒక్కటే 48,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, 713 కిలోమీటర్ల ప్రసార మార్గం ద్వారా హర్యానాకు విద్యుత్ పంపే ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాజెక్టులన్నీ వాతావరణ అస్తవ్యస్తత మధ్య కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ఏడాది పొడవునా ప్రవహించిన ఊటలు కనుమరుగయ్యాయి. 2025 ఆగస్టు వర్షపాతం సాధారణ స్థాయికి మించిన 930 శాతం పెరిగి, అకస్మాత్తు వరదలు సంభవించాయి. పశువులు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఒక సీజన్‌లో అధికంగా కోల్పోయిన నీరు, తదుపరి సీజన్‌లో కరువుగా మారుతోంది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో, అస్థిర భౌగోళిక నిర్మాణాల్లో నిర్మించే మౌలిక సదుపాయాలు ఈ నష్టాన్ని మరింత పెంచుతున్నాయి.
లడఖ్‌లో విస్తరిస్తున్న రోడ్లు, సొరంగాల జాలంలో సైనికీకరణ–అభివృద్ధి సంగమం స్పష్టంగా కనిపిస్తుంది. 1,600 కిలోమీటర్లకు పైగా రోడ్డు వెడల్పు చేయబడ్డాయి, కొత్తగా నిర్మించబడ్డాయి. లేహ్, కార్గిల్, శ్రీనగర్‌లను కలిపే జోజిలా సొరంగం, చైనా సరిహద్దు సమీపంలోని సియాచిన్ హిమనదికి సరఫరాలు చేర్చే భారత రక్షణ వ్యూహంలో కీలకమైనది. కానీ తవ్వకాల మలినాలు, నదుల అస్థిరత, కొండచరియల ప్రమాదం వంటి పర్యావరణ వ్యయాలను “వ్యూహాత్మక అవసరాలు”గా కొట్టిపారేస్తున్నారు.ఈ పరిస్థితుల్లోనే పర్యావరణ కార్యకర్త, సమాజ నాయకుడు సోనం వాంగ్‌చుక్ 2025 సెప్టెంబర్ 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. లడఖ్ ప్రతినిధులు–కేంద్ర ప్రభుత్వ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిరసన మొదలైంది. శీతాకాలంలో హిమనదుల కరిగిన నీటిని నిల్వ చేసే ‘ఐస్ స్తూపా’ ఆవిష్కరణతో వాంగ్‌చుక్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. స్థానిక జ్ఞానం పై ఆధారపడిన ఈ విధానం ఆండీస్ నుంచి హిమాలయాల వరకు అనుసరించబడింది.వాంగ్‌చుక్ నిరసన అభివృద్ధికి వ్యతిరేకం కాదు; భూమి, వనరులపై స్థానిక నియంత్రణకు రాజ్యాంగ రక్షణలు కావాలనే డిమాండ్.
లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన చాలాకాలంగా కోరుతున్నారు. ఇది స్వయంప్రతిపత్తి జిల్లా మండళ్లకు అభివృద్ధిని నిర్వహించే అధికారాన్ని, గిరిజన గుర్తింపును కాపాడే హక్కును ఇస్తుంది. రాష్ట్ర ప్రతిస్పందన మాత్రం వేగంగా, హింసాత్మకంగా వచ్చింది. సెప్టెంబర్ 24న నిరసనలు విస్తరించగా, లేహ్‌లోని ఒక బీజేపీ భవనానికి నిప్పు పెట్టారు. మొబైల్ డేటా ను నిలిపివేశారు, కర్ఫ్యూ విధించారు, ప్రజా సమావేశాలు నిషేధించారు. భద్రతా బలగాలు కాల్పులు జరిపి నలుగురు నిరసనకారులను హతమార్చాయి. శాంతికి పిలుపునిచ్చిన వాంగ్‌చుక్‌ను రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేసి, 1,300 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పూర్‌కు తరలించారు.లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతాలన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు.
నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.అయినా ప్రతిఘటన కొనసాగుతోంది. సిక్కింలో టీస్టా నదిని కాపాడేందుకు లెప్చా ఉద్యమం, ఒడిశాలో నియామ్గిరి కొండలను రక్షించిన డోంగ్రియా కొంధ్‌లు, మధ్య భారతంలో బొగ్గు గనులపై ఆదివాసీల పోరాటాలు—అన్నీ ఒకే మాట చెబుతున్నాయి: సమ్మతి లేని అభివృద్ధి అంటే వేరే పేరుతో జరిగే స్వాధీనీకరణ. వాంగ్‌చుక్ విడుదల కోసం సాగిన 350 కిలోమీటర్ల నిరసన యాత్ర ఇప్పుడు జోధ్‌పూర్‌కు చేరి, లడఖ్ స్వరాన్ని ప్రధాన భూభాగానికి తీసుకొచ్చింది.లడఖ్ లేవనెత్తుతున్న ప్రశ్న—సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా వద్దా అన్నది కాదు. పర్యావరణం, ప్రజాస్వామ్యం, స్థానిక జ్ఞానాన్ని చెరిపి వేయకుండా అభివృద్ధి సాధ్యమా అనేది అసలు ప్రశ్న. లడఖ్‌ను ఖాలీ పటములా చూడడం తాత్కాలికంగా వ్యూహాత్మక లక్ష్యాలకు ఉపయోగపడవచ్చు. కానీ దీర్ఘకాలంలో, దేశం ఆధారపడిన పర్యావరణ, సామాజిక, రాజ్యాంగ పునాదులనే దెబ్బతినే ప్రమాదం ఉంది.