– వన్‌టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలి
– గతంలో పిసిసి చీఫ్‌గా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
– సిఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి30: జీ.ఓ. నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జారీ చేసిన జీవో 317 వల్ల వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆ జీవో రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై అప్పటి సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ స్పష్టంగా పొందుపరిచినట్లు కవిత పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు గతంలో ఈ బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. జీ.ఓ.317 వల్ల ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. వెంటనే వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులు, ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. స్థానికతను గుర్తించే నిబంధనల్లో సమూల మార్పులు చేయాలన్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాల వారీగా సర్దుబాటు చేయడానికి జీ.ఓ. 317 తీసుకు వచ్చారు. జీవో బాధితుల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు అప్పటి సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ కమిటీ నివేదిక ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. శాంతి కుమారి కమిటీ ఇచ్చిన నివేదిక బయట పెడితే తప్ప జీవో నం.317 బాధితులు ఎంతమంది అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. సబ్ కమిటీ తన నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం దానిని బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.