వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు

– రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు

రాజస్థాన్‌, ‌డిసెంబర్‌ 6: ‌యువతీయువకుల సహజీవనం విషయంలో రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ వయస్సు రాకున్నా సరే మేజర్లయితే పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది. ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. యువకుడికి వివాహ వయస్సు రాలేదన్న పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనను కోర్టు తోసిపుచ్చింది. యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందన్న యువకుడి ఆందోళన నేపథ్యంలో ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. తామిద్దరమూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని ఆ యువ‌తీయువ‌కులు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. యువతి కుటుంబం దీనిని వ్యతిరేకిస్తూ తమను చంపేస్తామని బెదిరిస్తోందని, తమకు రక్షణ కల్పించాలని యువకుడు కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ జంట ఆరోపించింది. యువకుడికి వివాహ వయస్సు (21 ఏళ్లు) రాలేదని, సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌కోర్టుకు విన్నవించారు. అయితే  ‌ఆ వాదనను కోర్టు కొట్టివేసింది. పెళ్లి వయస్సు రాలేదనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ‌కల్పించిన స్వేచ్ఛా హక్కును హరించలేమని పేర్కొంది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని, దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్‌ అనూప్‌ ‌ధండ్‌ ‌స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *