– ఆ విచారణలో తేలేదేమీ ఉండదు
– కడియం ఏ పార్టీలో ఉన్నారో తెలపాలన్నాం
– వీటి గురించి మాట్లాడితే కేసులతో వేధింపులా?
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ స్కామ్‌ను తమ పార్టీ నేత హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టారని, దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని, హౌస్ కమిటీ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమస్య అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ దీనిపై సీఐడీ దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం చెబుతోందని, సీఐడీ అధికారులు మంత్రిని ప్రశ్నించే అవకాశం ఉంటుందా అని నిలదీశారు. అందుకే పొంగులేటిని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాగా, పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలతో ముఖ్యమంత్రి మాట్లాడించారని, నాగేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడి బెదిరించారని ఆయన తెలిపారు. కడియం బీఆరఎస్‌లో ఉంటే అన్నం పెట్టిన కేసీఆర్, హరీశ్‌రావును విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నావు, ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావంటూ తనతోపాటు బీఆర్ఎస్ సభ్యులందరం ప్రశ్నించడం తప్పా అని అడిగారు. ప్రజల పక్షాన నిలబడినందుకు తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ టార్గెట్ చేశారని ఆరోపించారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాలు అడిగినందుకా, పెన్షన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించినందుకా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు అందరూ విన్నారని, ఎథిక్స్ కమిటీకి వారి తిట్లు వినిపించవా అని ప్రశ్నించారు. హావిÖలపై మేం ప్రశ్నిస్తే మమ్మల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి అవినీతిని బయటపెడితే ప్రభుత్వం స్పందించడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్ మండిపడ్డారు. మైనింగ్‌పై అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నిజమైన నాయకులంటే పార్టీ లైన్‌లో ఉండాలి.. కానీ పార్టీ మారిన మనిషిని మీ భుజాల మీద ఎందుకుఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. తోటి శాసనసభ్యుడిని తిట్టేందుకు మంత్రులకు మైక్‌లు ఇచ్చారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఒక్కరైనా స్జబెక్ట్ మాట్లాడారా, స్వర్ణకారుల కష్టాల గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అవినీతి మంత్రిని, పార్టీ మారిన వ్యక్తిని వెనుకేసుకొచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కడియం మా వెనుకాల కూర్చోవాలి కానీ అలాంటి నాయకుడిని మీరు వెనుకేసుకొస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పాలసీల గురించి మాట్లాడుతున్నామా అంటూ మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల గురించి మాత్రమే అని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





