కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, జులై 5 : కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు స్నాతకోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, ఇంటలిజెన్స్ విభాగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. గత వారం రోజులుగా క్యాంపస్లో పాలకమండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు సంఘాలు నిరసనలకు దిగకుండా ఇంటలిజెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రశాంతమైన వాతావరణంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
గత పాలకమండలి సమావేశంలో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయించడంతో విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. తమ నిరసనల ద్వారా రాష్ట్రంలోని ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు, బిఆర్ఎస్వి నుంచి సీనియర్స్ స్కాలర్స్ 10 మంది వరకు డాక్టరేట్ పట్టాలను అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీరి కదలికల మీద కూడా నిఘా విభాగం పోలీస్లు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించారు. తమ కుటుంబాలతో కలిసి గవర్నర్ చేతుల మీద డాక్టరేట్ పట్టా తీసుకోవాలని నిర్ణయించుకున్న సీనియర్ పరిశోధకులు శనివారం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి రామచంద్రంను కలిశారు. తమను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
తాము స్నాతకోత్సవం ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రిజిస్ట్రార్ రామచంద్రం సంబంధిత పోలీస్ అధికారులకు డాక్టరేట్ పట్టాలు అందుకోబోయే వారిని ఏలాంటి అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించినా తీవ్రమైన కేసులు ఉంటాయని మరోవైపు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది.





