– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
– దూరదర్శన్, రేడియోలో ఉచిత ప్రసారం
న్యూదిల్లీ, మార్చి 23: నాలుగు అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో మాత్రమే ఈ ఉచిత ప్రసార అవకాశం ఉంటుంది. త్వరలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఉచిత ప్రసార అవకాశం కల్పించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 39ఏ సెక్షన్ కింద రాజకీయ పార్టీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఈసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్టాల్రు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఐటీ ఎలాట్‌ఫాం ద్వారా ఈ డిజిటల్ టైమ్ వోచర్లు జారీ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ బ్రాడ్‌కాస్ట్ విండో అభ్యర్థుల జాబితా విడుదలైన తేదీ నుంచి ప్రారంభమై పోలింగ్‌కు రెండ్రోజుల ముందు వరకూ కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్ర/యూటీ స్థాయిలో పారదర్శకంగా డ్రా నిర్వహించడం ద్వారా బ్రాడ్‌కాస్ట్ స్లాట్‌లు నిర్దారిస్తారు. ప్రతి పార్టీకి దూరదర్శన్, అల్ ఇండియా రేడియాలో 45 నిమిషాల ఉచిత ప్రసార సమయం కేటాయిస్తారు. గత అసెంబ్లీ సమయంలో పార్టీల పనితీరు ఆధారంగా కూడా అదనపు ప్రసార సమయం కేటాయించే వీలుంటుంది. సాంకేతిక, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ట్రాన్స్‌క్రిప్టులు, రికార్డింగ్‌లను ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను సమష్టిగా వ్యక్తం చేసేందుకు వీలుగా ప్రసార భారతి ప్యానల్ డిస్కషన్లు, డిబేట్లను కూడా నిర్వహిస్తుంది. చిత ప్రసార సమయం కేటాయింపు ద్వారా రాజకీయ పార్టీలు తమ విధానాలను, ప్రచారాన్ని ప్రజల్లోకి సులభంగా తీసుకువెళ్లవచ్చని ఈసీఐ భావిస్తోంది. ఇది ఎన్నికల పక్రియలో పారదర్శకతను పెంచి, సమాన అవకాశాలు కల్పించే డిజిటల్ చొరవగా పేర్కొంటోంది. ఇటీవల ఐదు రాష్టాల్రు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఒకే దశలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. నాలుగు రాష్టాల్రు, పుదుచ్చేరిలో మే 4న ఫలితాలు వెలువడతాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




