ఖ‌మ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజ‌కీయాలు

– ఛైర్ ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌పై ఉత్కంఠ‌
– కొత్త‌గూడెంలో ర‌స‌ప‌ట్టు రాజ‌కీయం

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా  ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా లోని ఎదులాపురం, వైరా, మధిర , కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడo  జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంత్రులు , ఎమ్మెల్యే ద్వారా ఇప్పటికే ఆయా పురపాలికలకు కేటాయించిన రిజర్వేషన్ ను  బట్టి ఛైర్ పర్సన్ కావటానికి అర్హత కలిగిన అభ్యర్థుల వివరాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ  సేకరించింది. అభ్యర్థి వృత్తి, అనుభవం, రాజకీయ నేపథ్యం తదితర సమాచారాన్ని పీసీసీకి చేరవేసింది. ఈ క్రమంలో ఛైర్ పర్సన్  పీఠం కోసం అభ్యర్థులు వేరుకుంపటి పెట్టుకోకుండా శిబిర రాజకీయాలకు పార్టీ నాయకులు తెరలేపారు. అశ్వారావుపేట పురపాలికలోని కాంగ్రెస్ విజేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రాజోలుకు, వైరా, సత్తు పల్లి, కల్లూరు, ఇల్లెందులోని విజేతలను హైదరాబాద్ కు  తరలించారు. మధిర, ఏదులాపురంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు స్థానిక శిబిరాల్లో ఉంటున్నారు. కొత్తగుడెం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు 22, సీపీఐ 22గా సమానంగా కౌన్సిలర్లు గెలవడంతో ఇతర కౌన్సిలర్ల ను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆయా  పార్టీల నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సిపిఐ కూటమి కార్పొరేటర్లు ఆంధ్ర వైపు వెళ్లారు. తెలంగాణలో అధికార పార్టీ నిఘా కు దొరకకుండా పొరుగు రాష్ట్రం వైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ వర్గీయులు హైదరాబాద్ లో క్యాంపు శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాల్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఛైర్మెన్ అభ్యర్థులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని సమాచారం. ఒక కార్పొరేషన్ , ఏడు మున్సిపాల్టీల్లో  గెలిచిన ప్రజా ప్రతినిధులు నేరుగా ఆయా పురపాలక కార్యాలయాలకు సోమవారం ఉదయం హాజరుకానున్నారు. వారి ప్రమాణ స్వీకారం, ఛైర్మెన్, ఉప ఛైర్మెన్ ను ఎన్నుకోనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *