– హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ ప్రారంభం
– టెలికాలర్‌గా ప్రజలకు మంత్రి పొంగులేటి సమాధానాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఫోన్ నెంబరు 1800 599 5991ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్ రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటిని పరిష్కారానికి ఉపయోగపడుతుందని వివరించారు. గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా సిబ్బంది ఫొటోలను అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలు పరిశీలించి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని, తిరిగి ఆ వివరాలు తెలియచేస్తారని వివరించారు. ఇండ్ల పథకంలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధ(ఎఐ)ను కూడా వాడుతున్నామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి టెలికాలర్‌లా వ్యవహరించి ప్రజలతో నేరుగా సంభాషించి వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
మంత్రి: హలో.. నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను.. మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి చెప్పండి.
ఫోన్ చేసిన వ్యక్తి : సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం. బేస్‌మెంట్ వరకు ఇల్లు పూర్తి అయింది. ఇంకా బిల్లు రాలేదు.
మంత్రి: బేస్‌మెంట్ పూర్తయి ఎన్నిరోజులు అవుతుంది.. మీరు బేస్‌మెంట్ పూర్తయిన ఫొటో అప్ లోడ్ చేశారా?
ఫోన్ చేసిన వ్యక్తి : చేశాం సార్
మంత్రి: మీ ఆధార్ నెంబర్ చెప్పండి..(మంత్రి స్వయంగా ఆధార్ నెంబరును కంప్యూటర్‌లో ఎంట్రీ చేసి పరిశీలించారు) మీ బిల్లు ఈఈ వద్ద ఉంది.. వచ్చే సోమవారం మీకు రూ.లక్ష బిల్లు మీ ఖాతాలో జమ అవుతుంది. మీ ఊరిలో ఎన్నిఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి.. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు.
మరో ఫోన్ కాల్: మాకు హైదరాబాద్‌లో ఇండ్లు ఎప్పుడు ఇస్తున్నారు.. వెరిఫికేషన్ కూడా అయిపోయింది
మంత్రి: హైదరాబాద్‌లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమైంది.. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





