18న మేడారంలో కేబినెట్‌ ‌భేటీ ?

-1 9న మేడారం పనులకు సీఎం ప్రారంభోత్సవాలు
– అదే రోజు రాత్రికి దావోస్ ‌ప్ర‌యాణం

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజధాని వెలుపల కేబినెట్‌ ‌భేటీ జరపాలని  నిర్ణయించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. అయితే సిఎం షెడ్యూల్‌ ‌కారణంగా అక్కడ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా సమాచారం వెల్ల‌డి కావాల్సివుంది. ’సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర’ ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్‌ ‌భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత క్యాబినెట్‌ ‌సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్‌కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్‌ ‌విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశముంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనా క్యాబినెట్‌ ‌భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బ్జడెట్‌ ‌ప్రవేశపెట్టనుండడంతో.. అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్‌ ‌రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతుభరోసా నిధుల విడుదల, హ్యామ్‌ ‌రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

జాతరకు రానున్న సీఎం : ‌మేడారం రూట్‌లో మరమ్మతులు

ములుగు: సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వచ్చే కొత్త దారికి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సీఎం నేరుగా హెలీప్యాడ్‌ ‌నుంచి కాన్వాయ్‌లో కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌దుగా దేవస్థానం ముందు ప్రధాన ద్వారం వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సీఎం వచ్చే దారికి భక్తుల క్యూలైన్‌గా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో సీఎం రాకతో భక్తుల దర్శనాలు నిలిపివేసి వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కొత్త దారిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే  మహాజాతరకు మేడారం వచ్చే భక్తుల సౌకర్యాల్లో భాగంగా స్నాన ఘట్టాలకు అధికారులు పెయింటింగ్‌ ‌పనులు ప్రారంభించారు. మెట్లు శుభ్రంగా ఉండే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవ డానికి తరలివచ్చే భక్తులకు అధికారులు ఉచితంగా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ ‌ద్వారా ట్యాంకులు ఏర్పాటు చేసి అందజేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *