చివరి దశకు చేరుకున్న కసరత్తు
– మరో ఆరుగురికి అవకాశం?
– సామాజిక న్యాయంపై దృష్టి
– వందమందితో జంబో కార్యవర్గం?
( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రెండురోజులుగా చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకోనుందనుకుంటున్నారు. నీతి అయోగ్ భేటీలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణతోపాటు, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డితోపాటు, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కూడా చర్చించి చాలారోజులుగాఉన్న ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్న విషయం తెలిసిందే. అయితే పోటీదారుల సంఖ్యకూడా చాలా ఎక్కువగానే ఉండడంతో ఎవరిని మంత్రులుగా తీసుకోవాలన్న విషయంలోనే చాలాకాలంగా మల్లగుల్లాలు పట్టడమవుతున్నది. వివిధ సామాజికి వర్గాలు, వారికున్న బలాబలాలను బేరీజు వేసుకోవడంతోపాటుగా, ఇప్పటివరకు ప్రాతినిధ్యంలేని జిల్లాలకు అవకాశం కల్పించే విషయంలోనే ఈ కసరత్తు జరుగుతున్నది. ముఖ్యంగా కులగణన, బీసీ రిజర్వేషన్‌లకు ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్, అదేబాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించింది. కొత్తగా తీసుకునే మంత్రిపదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి తప్పనిసరిగా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
కాగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే మంత్రులుగా ఆరుగురిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురు లేదా అయిదుగురిని మాత్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుందన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. మహబూబ్‌నగర్ జిల్లానుంచి వాకిటి శ్రీహరి పేరు చాలాకాలంగా వినిపిస్తున్నది. అలాగే నిజామాబాద్‌నుండి పి. సుదర్శన్‌రెడ్డిని తప్పక తీసుకుంటారనుకుంటున్నారు. ఎందుకంటే సుదర్శన్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి చాలా సన్నిహితుడిగా ప్రచారంలో ఉంది. తనకు కాంగ్రెస్ పార్టీ గతంలోనే వాగ్ధానం చేసిందని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నల్లగొండనుండి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బాలూనాయక్‌కూడా. రంగారెడ్డి జిల్లానుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్ పేర్లతోపాటు కరీంనగర్ జిల్లానుంచి ఆది శ్రీనివాస్ ఈ పరుగుపందెంలో ఉన్నారు. వీరితోపాటు మైనార్టీల్లో షబ్బీర్ అలీ, అమేర్ అలీఖాన్ పేర్లు ముందువరుసలో ఉన్నాయి. మహిళలను తీసుకోవాల్సి వస్తే విజయశాంతికి ప్రధాన్యమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పీసీసీ కార్యవర్గం విషయాన్నికూడా సిఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లు పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కెసీ వేణుగోపాల్‌తో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తున్నది. జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. సుమారు వందమందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ఇందులో నలుగురు వర్కింగ్ ప్రసిడెంట్లను నియమించనున్నట్లు తెలుస్తున్నది. వీరి నియామకంలో సామాజిక సమీకరణలకు ప్రాదాన్యతనిచ్చే అవకాశాలున్నాయి. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని పార్టీ పదవుల్లో తీసుకోకూడదన్న విషయంపైనకూడా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఒకవేళ తీసుకోవాల్సివస్తే, వారు నామినేటేడ్ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై చాలాకాలంగా ఆశ పెట్టుకున్న నాయకులకు రెండు రోజుల్లో తీపి కబురు అందబోతున్నది.





