– నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సర్వ సన్నద్దంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉప ఎన్నిక నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి నోడల్ అధికారులతో ప్రాథమిక సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. సిబ్బంది, ఈవీఎం, వీవీ ప్యాట్ రవాణా, శిక్షణ, సామగ్రి నిర్వహణ, ప్రవర్తనా నియమావళి, శాంతిభద్రతలు, వల్నరబులిటీ మ్యాపింగ్, జిల్లా సెక్యూరిటీ ప్లాన్, వ్యయ పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్, ఫిర్యాదుల పరిష్కారం, లైవ్ వెబ్‌కాస్ట్, ఎస్‌ఎంఎస్ మానిటరింగ్, కమ్యూనికేషన్ ప్లాన్, స్వీప్ యాక్టివిటీస్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సన్నద్ధతను సంబంధిత నోడల్ అధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం ఓటర్లను మ్యాన్ పవర్ జాబితాలో ఉండకుండా చూడాలన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాల కోసం ఈవీఎం, వీవీప్యాట్‌లను సిద్ధం చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ‘స్వీప్’ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్లను ఈ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. మీడియా కమ్యూనికేషన్ కోసం మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వారం రోజుల తర్వాత మరోసారి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తానని, నోడల్ అధికారులు తమ సన్నద్ధతను తెలిపే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస రెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ బోర?డే, రవి కిరణ్, అదనపు కమిషనర్లు అలివేలు మంగతాయారు, కె.వేణు గోపాల్, గీతా రాధిక, విజిలెన్స్ ఏ.ఎస్.పి సుదర్శన్, సీవీవో డాక్టర్ అబ్దుల్ వకీల్, పి.ఆర్. ఎం.దశరథం తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





