– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం
– 13మంది ప్రయాణికుల సజీవ దహనం
– పలువురికి తీవ్ర గాయాలు
మార్కాపురం, ప్రజాతంత్ర, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. గురువారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. మృతుల వివరాలు.. సీహెచ్ మనోజ్‌కుమార్ (18), వింజమూరు, సీహెచ్ సుజాత (45), వింజమూరు, సీహెచ్ మేఘన (19), వింజమూరు, టి.నరేంద్ర (25), నల్లగొండ్ల, టి.చందన (21), నల్లగొండ్ల, టి.చందు (6), నల్లగొండ్ల, కె.ప్రకాశ్ (17), అయ్యవారిపల్లె, కె.అయ్యన్న (18), (ఎర్రబొట్లప్లలె) వి.గురవయ్య (60), చింతగుంట్ల, కె.అబ్రహం (42), చోడవరం, పి.మహేంద్రరెడ్డి (17), చోడవరం రామచంద్ర ప్రవీణ్ (21), చోడవరం, ఎ.సౌజన్య (22), పెదారికట్ల ఉన్నారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు,ప్రధాని మోడీ, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





