– గ్రామీణ మహిళలకు ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు అండ
– ప్రభుత్వ స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి ఇది చరిత్రాత్మక ముందడుగు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో గ్రామ సంస్థలు (వీవోలు), ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని మహిళా స్వయం సహయక సంఘ సభ్యులు ప్రభుత్వానికి ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో భవనానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. 200 గజాల్లో, కనీసం 552 చదరపు అడుగుల్లో భవనం ఉండేలా డిజైన్ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామీణ మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి, నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలి. అందుకే ప్రతి గ్రామంలో ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనం ఉండాలి. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గ్రామ సభ తీర్మానం ఆధారంగా ప్రతిపాదనలు మండల, జిల్లాస్థాయిల ద్వారా జిల్లా కలెక్టర్ అనుమతితో పనులు చేపట్టనున్నారు. నిర్మాణాలను పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూర్తిచేస్తారు. ఉపాధి హమీ నిధులతో చేపట్టే ఈ పనులకు సామాజిక తనిఖీ తప్పనిసరిగా నిర్వహించనున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తైన ఆరు నెలలలోపు సోషల్ ఆడిట్ పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





