– 412 మందికి ఇంటి పట్టాల పంపిణీ
– డిసెంబర్ 9న సీఎం చేతుల మీదుగా గృహప్రవేశాలు
– రాష్ట్రంలో ప్రతి పేదవానికీ ఇల్లు ప్రభుత్వ లక్ష్యం
– డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 11: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని, దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా కాలనీ నిర్మాణం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు విద్యుత్, నీళ్లు, రోడ్లు, హాస్పిటల్, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇటీవల తొలగించిన ఇళ్ల బాధితులకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు బుధవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గురువారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించండి.. డిసెంబర్ 9కల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ముగ్గురు మంత్రులం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని గృహ ప్రవేశాలకు ఆహ్వానిస్తామన్నారు. ఇది పేదల పక్షాన తమకు ఉన్న నిబద్ధత అని అన్నారు. ఇల్లు కట్టిస్తామని పదేళ్లపాటు పరిపాలించిన వారు చెప్పిన మాటలు నమ్మి చూసిచూసి పేదల కళ్ళు కాయలు కాశాయని, వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని తెలిపారు. అలాంటి వారికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ ఆలోచన అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు రూ.22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసి చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ప్రభుత్వంపై కావాలని పేదలకు మేలు జరగవద్దని కొద్దిమంది బురద జల్లుతున్నారన్నారు. కొన్నేళ్లుగా మాఫియా వెలుగుమట్లలో పేదల నుంచి డబ్బులు వసూలు చేసిందని, వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని వెలుగుమట్లలో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పేదలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆత్మ గౌరవంగా బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి తరతమ భేదం లేకుండా పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు తెలిపారు. పేదల అసహాయతను అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.#Government will build #a model colony #in Velugumatla #Dy CM Bhatti
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





