మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క
ములుగు ,ప్రజాతంత్ర, జూన్ 26: యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు వ్యాపారాత్మక ధోరణిలో పసి పిల్లలకు చాకోలెట్స్ రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేయించి ఆ మత్తులోకి లాగేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీన్ని సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతుందని అన్నారు. యువత డ్రగ్స్ కి అలవాటు కావడం వలన వారి నిండు భవిష్యత్తు చీకటిలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. రాష్ట్రం లో కానీ, దేశంలో కానీ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల పై కూడా అత్యంత క్రూరంగా జరుగుతున్న లైంగిక దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నవారే అధికంగా ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం చేయడం వల్ల కుటుంబాలు నాశనం కావడమే కాకుండా ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతి యువకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలు వాడకం చేయడంలో దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనారోగ్య సమస్యలపై యువత అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో యాంటీ డ్రెస్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, దీని వాడకం చేయడం వలన జరిగే నష్టాలపై సంబంధిత శాఖల అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే ఆలోచనతో యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి జీవితాన్ని కొనసాగించడానికి చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. యువతే దేశ భవిష్యత్తు అని, మీ తల్లి తండ్రులు మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నతబుద్యోగాలు సాధించి కుటుంబానికి, ఈ దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు. చదువుతున్న యువతలో వారు స్వతహాగా మంచి ఆలోచనతో ఉన్నా కూడా చుట్టూ ఉన్న సహచరుల ప్రభావం వల్ల కూడా చాలా మంది సిగరెట్, గంజాయి వంటిడ్రగ్స్ కి అలవాటు అయ్యే ప్రమాదం ఉందని, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వారు నుండి దూరం కావడం చాలా కష్టం, సమాజం కూడా ఇలాంటి వారిని చిన్న చూపు చూస్తుంది. ఇలా డ్రగ్స్ కి బానిస అయిన వారిని బయటకు తీసుకు రావడానికి కేవలం కౌన్సిలింగ్ అనే ఒక మార్గం మాత్రమే ఉందని, ఎవరినైనా అలాంటి పరిస్థితుల్లో గుర్తిస్తే నషా ముక్త్ భారత్ అభియాన్ విభాగాలను సంప్రదించాలని అన్నారు. ఒక అందమైన జీవితం మీ కోసం ఎదురుచూస్తుంది దానిని సాధించడం కోసం ప్రయత్నించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్ పి శబరీష్ మాట్లాడుతూ అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. టీచర్లు, తల్లి తండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి పెట్టాలని, వారి క్రమశిక్షణ, ప్రవర్తన లో ఏవిధమైన మార్పులు గమనించినా తగిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనలో పోలీస్ శాఖ చేస్తున్న యజ్ఞం లో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వాడటం వాళ్ళ కలిగే నష్టాలపై ప్రదర్శించిన నాటిక కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆలోచింపచేసింది. అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పితో కలిసి జెండా ఊపి ఈ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతల నుంచి విచ్చేసిన దాదాపు 1500 మంది యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, అదనపు ఎస్పి సదానందం, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ పాల్గొన్నారు.


