సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రారంభం

– పార్కు పురోగతిపై మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సమీక్ష
– వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఫుడ్‌ పార్క్‌ పురోగతిపై మంగళవారం సమీక్షించారు. ఈ మెగా ఫుడ్‌ పార్కుకు ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పి.ఎం.కె.ఎస్‌.వైలో భాగంగా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 2016 ఫిబ్రవరి 5న ఆమోదం లభించింది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌ పార్క్‌కు నాడు మంత్రిగా ఉన్న తుమ్మల పునాదులు వేశారు. పొలం నుంచి మార్కెట్‌ వరకు విలువ గొలుసు ఉండేలా ఆహార ప్రాసెసింగ్‌ కోసం కోర్‌ ప్రాసెసింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సీపీసీ హబ్‌గా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు ఉద్దేశమన్నారు. ప్రాథమిక ప్రాసెసింగ్‌ కేంద్రాలు పీపీసీ సేకరణ కేంద్రాలు సీసీలు సీపీసీకి మద్దతుగా ఉంటాయి. బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌లో సీపీసీ, రెండు పీపీసీలు పూర్తి అయ్యాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.109 కోట్లు. అందులో రూ.99 కోట్లు ప్రాజెక్ట్‌ వ్యయం కాగా మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ నుంచి రూ.28 కోట్లు గ్రాంట్‌ వచ్చింది. ప్రస్తుతం 26 ఎకరాల్లో పలు కంపెనీలకు ప్లాట్స్‌ కేటాయించారు. గొర్లాస్‌ గ్రీన్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇన్ఫినిటీ ఇండస్ట్రీస్‌కు ప్లాట్లు కేటాయించారు. తాజాగా దీపక్‌ నెక్స్‌జెన్‌ ఆక్వా ప్రాజెక్ట్‌కు స్థలం కేటాయించారు. రూ.615 కోట్లు దీపక్‌ నెక్స్‌జెన్‌ పెట్టుబడులతో 3200 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్‌ పార్క్‌

నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ 2016లో ఆర్భాటంగా శంకుస్ధాపన చేశారు. తొమ్మిదేళ్ళు పూర్తయినా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవ్వలేదు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల బుగ్గపాడు ఫుడ్‌ పార్క్‌ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సమీక్షించారు. సంక్రాంతి నాటికి ఫుడ్‌ పార్క్‌ ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్ట్రాటజిక్‌ లొకేషన్‌లో పార్క్‌కు తుమ్మల రూపకల్పన

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం కలిగిన మంత్రి తుమ్మల వ్యవసాయ రంగంలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు బాటలు వేసి తనదైన ముద్ర వేశారు. వ్యవసాయ ఉద్యాన పంటలకు సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలు కేరాఫ్‌గా ఉన్నాయి. దాంతో రైతాంగానికి మేలు చేసేలా పంట ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్‌ పెంచేలా అగ్రి బై ప్రొడక్ట్స్‌ పరిశ్రమల స్థాపన జరిగేలా ఫుడ్‌ పార్క్‌కు రూపకల్పన చేశారు. రోడ్డు-రైల్వే-పోర్ట్‌ కనెక్టివిటీ ఉండేలా స్ట్రాటజిక్‌ లొకేషన్‌గా బుగ్గపాడు ఎంపిక చేశారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్స్‌) మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *