కొహెడ మార్కెట్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

– మంచి ఆలోచనలతో ప్రభుత్వం వద్దకు రావాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటోందని తెలిపారు. కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్‌కు సంబంధించిన భూములను అమ్మే ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఆధునిక సదుపాయాలతో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఈ మార్కెట్ అభివృద్ధికి రూ.3087 కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేశామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అది రూ.399.96 కోట్లకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం కోహెడలో సర్వే నం.507/2, 548/2లలో ఉన్న 178.09 ఎకరాల భూమిని పండ్ల మార్కెట్ కోసం కేటాయించినప్పటికీ బీఆరఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోహెడ మార్కెట్‌ను సమీకృతంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే కేటాయించిన భూమికి అదనంగా సర్వే నం.167/1లో ఉన్న 239 ఎకరాల భూమిని మార్కెటింగ్ శాఖకు అప్పగించేందుకు ఫిబ్రవరి 23న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అదే సమయంలో అగ్రి ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. హరీశ్ రావు కోహెడ మార్కెట్ స్థలాన్ని సందర్శించి ఈ భూములను ఇతర సంస్థలకు కేటాయిస్తారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు. గతంలో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు విమర్శలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయ ప్రయత్నమేనన్నారు. త్వరలోనే కోహెడలో ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఏర్పాటు చేసి, రైతుల ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే టీజీఐఐసీకి కేటాయించిన భూమిలో పండ్ల ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమం చేస్తామన్నారు. ఈ రెండు వేర్వేరు విధాలుగా మార్కెట్లు పనిచేస్తాయని, ఒకటి హోల్‌సేల్ వ్యాపారం కోసం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పరిధిలో కొనసాగుతుందని, మరొకటి జాతీయ-అంతర్జాతీయ ఎగుమతుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *