– వారి జీవితాలను అంధకారం చేసింది మీరే
– మొసలి కన్నీళ్లను ఎవరూ నమ్మరు
– పదేళ్లపాటు నిరుద్యోగులను వంచించింది మీరుకాదా?
– లీకేజీలతో లక్షలాదిమంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు
– ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజతంత్ర, జనవరి 9: నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. పదేళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన మీరు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తుంటే యావత్తు తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో ఎద్దేశా చేశారు. అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా.. నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగుల యవ్వనాన్ని రోడ్ల పాలు చేసింది మీరు కాదా? అధికారం పోగానే మీకు నిరుద్యోగులు గుర్తొచ్చారా…? రాజకీయం కోసం బురద చల్లడం మానేసి తాము ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఒకసారి లెక్కపెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది దమ్ము ఎవరిదో, మోసం ఎవరిదో! టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను పప్పుబెల్లాల్లా బజార్లో పెట్టి అమ్ముతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు కాదా? ‘లీకేజీ’లతో లక్షలాదిమంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్న పాపం మీది కాదా అని ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థత మీది. రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దు కావడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురయ్యారు. అప్పుడెందుకో మాట్లడలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని మీలా లైట్‌గా తీసుకోలేదు. ఒక పవిత్ర కార్యంగా తీసుకున్నాం. ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించి…. ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం చేశాం. ప్రభుత్వోద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ మీకు చేతకాక చేతులెత్తేస్తే మేం విజయవంతంగా నిర్వహించాం. అది వాస్తవం కాదా…? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అపాయింట్ మెంట్ ఆర్డర్లను ఇచ్చాం. ఇది వాస్తవం కాదా…? త్వరలోనే గ్రూప్ 3 అపాయింట్ ఆర్డర్లను కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అది నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ అన్నారు.
తన మాటలను కావాలనే వక్రీకరిస్తున్నారు
తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలనే పనిగట్టుకుని వక్రీకరిస్తున్నారన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ… నేను ఆ మాట అన్నది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు. తెలంగాణ భవిష్యత్తు మీరే. ప్రభుత్వోద్యోగాల భర్తీని తాము మొక్కుబడిగా తీసుకోలేదు. ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు మాట నిలబెట్టుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలను చిత్తశుద్ధితో భర్తీ చేస్తున్నాం. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఓవైపు ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తూనే మరోవైపు పరిశ్రమల ప్రస్తుత అవసరాలకనుగుణంగా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించి ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం క్లియర్ కట్ గా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేదు. ఈ విషయంలో శాస్త్రీయబద్ధంగా ముందుకు వెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మి మోసపోకండి. వారి ఊబిలో చిక్కి వారి రాజకీయ క్రీనీడలో భాగస్వామ్యం కాకండి. మీ భవిష్యత్తుకు మాది భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



