– బూడిద తెలంగాణ ప్రజలకు
– కెటిఆర్ వ్యంగ్య విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై16: న్యూదిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ దిల్లీ పర్యటన గుట్టు రట్టయ్యిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అన్నారు. తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు.. తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలిందన్నారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి…. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈ రోజుతో తేలిపోయిందని స్పష్టం చేశారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి.. తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి.. చెరిపేయి సరిహద్దులు! అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణా మీద నీఅక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో!.. ఒక్క మాట గుర్తు పెట్టుకో.. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటు-న్న రాబందుల పని తప్పక పడతామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.





