పలుచోట్ల స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినా ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ పార్టీ పలు స్థానాల్లో సత్తా చూపింది. హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గులాబీ సైన్యం పోటీ చేసిన ప్రతి పంచాయతీలో పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి పంచాయతీల సంఖ్య కొద్దిగా మెరుగ్గా ఉన్నట్టు కనిపించినా ఆ పార్టీకి గ్రామాల్లో 56శాతం వ్యతిరేక వోట్లు పడ్డట్టు ఫలితాలనుబట్టి తెలుస్తున్నది. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి వోటు వేసి గెలిపించారు. మేజర్ గ్రామ పంచాయతీకి బీఆర్‌ఎస్ బలపరిచిన 95 ఏండ్ల రామచంద్రారెడ్డి తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నేత మడకం జోగయ్య 84 వోట్ల తేడాతో గెలిచారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగు మేజర్ గ్రామ పంచాయతీ ఏటూరునాగారంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత 3,230 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. 60 శాతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. జడ్చర్ల, భద్రాచలం, షాద్‌నగర్, మహబూబాబాద్, ఇంకా అనేక నియోజవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్‌లను గెలిపించుకోలేకపోయారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామ పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో 396 ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్న మేజర్ పంచాయతీలను వేలం పాటల ద్వారానే కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. గులాబీ పార్టీ 1,345 చోట్ల విజయం సాధించినట్టు వార్తలు అందాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులు కేవలం 10వోట్ల లోపు తేడాతో 50కి పైగా గ్రామాల్లో ఓటమి చవిచూసినట్టు, 20 వోట్ల తేడాతో ఓడిన గ్రామాలు 150కిపైగానే ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము అధికారంలోకి వొస్తామని కలలు కంటున్న బీజేపీ కేవలం 186 గ్రామ పంచాయతీలకే పరిమితమైంది. ఏ పార్టీ మద్దతు లేకుండానే పోటీ చేసిన అభ్యర్థులు 524 పంచాయతీల్లో విజయం సాధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.