17 లోపు నిర్ణయం ప్రకటించాలన్న కోర్టు
ఏర్పాట్లు ముమ్మరం చేసిన బిఆర్‌ఎస్
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): బిఆర్‌ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవాలను గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనంత వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 1600 సువిశాల స్థలంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. అయితే అ సభకు అనుమతించే విషయంలో అధికారం అడ్డుపడుతోంది. సభా నిర్వహణ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుపై అధికారులు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. లక్షలాది మందితో నిర్వహించాలనుకుంటున్న ఈ సభకు స్థానిక పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తీసుకున్న నిర్ణయం ఆటంకంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల ఆరవ తేదీ నుంచి మే నెల 5వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం సభ నిర్వహణకు అంతరాయంగా మారింది.
సిటీ పోలీస్ యాక్ట్ అమలువల్ల కమిషనరేట్ పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధం. వాస్తవంగా సిటీ పోలీస్ యాక్ట్‌ను ప్రకటించడానికి ముందే బిఆర్‌ఎస్ నాయకులు సభ నిర్వహణకు అనుమతించాల్సిందిగా అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలను అందించారు. అయినప్పటికీ అధికారులు దానిపై స్పందించకపోవడంతో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదు. ఈ విషయంలో ఈనెల 17లోగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. అయితే తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు మరికొంత సమయం అంటే ఈనెల 21 వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరినప్పటికీ, సభ ఏర్పాట్లకు వారికి సమయం ఉండాలి కదా అంటూ 17వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని జడ్జి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూడు వేలకు పైగా ఆర్టీసి బస్సుల కోసం ముందస్తుగా డబ్బు చెల్లించినట్లు చెబుతున్నారు. వాటితో పాటు ఇతర ప్రైవేటు బస్సులు, టాక్సీలు, డీసీఎం వాహనాలు చివరకు ఆటోలను కూడా జనాన్ని తరలించేందుకు సిద్దం చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల పైచిలుకు వాహనాలు వొచ్చే అవకాశాలుండడంతో సభ సమీపంలో 1200 ఎకరాల స్థలాన్ని అందుకోసం ప్రత్యేకించారు. లెక్కకు మించిన వాహనాలు వొస్తుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు బాధ్యతను అప్పగిస్తున్నారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గత కొంతకాలంగా వివిధ జిల్లాల నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేయాలన్న విషయాలను వారికి వివరిస్తూ వొస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చినట్లుగానే, ఈ సభలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రజలు అదే ఉత్సాహాన్ని చూపుతున్నారంటున్నారు జిల్లా స్థాయి బిఆర్‌ఎస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనపై విరక్తి పుట్టడమే ఇందుకు కారణమంటున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారం చేపట్టి 16 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీ పథకాలను అమలు చేయకపోవడంపై ప్రజల అసహనంగా ఉన్నారని, ఆ అసహనమే బిఆర్‌ఎస్ సమావేశానికి అధికసంఖ్యలో రావడానికి వారు చూపిస్తున్నఉత్సాహమంటున్నారు. వాస్తవంగా ఉద్యమకాలంలో ఉద్యమకారులకు ఆక్సీజన్ నింపడానికి వరంగల్‌లో సభలు నిర్వహించేవారు. ఇక్కడ సభ విజయవంతమైతే ప్రజలు ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నట్లు ఉద్యమ నేతలు భావించేవారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ పదవి కోల్పోయి 16 నెలలు కావస్తున్నది. ఈ 16 నెలల్లో పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నది. ఉద్యమపార్టీగా చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ను, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నది. పదిమంది ఎంఎల్‌ఏలను తమపార్టీలోకి ఆహ్వానించడంద్వారా బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇప్పటికే దెబ్బతీసింది. ఈ విషయం కోర్టు విచారణలో లేకపోయినట్లైతే బిఆర్‌ఎస్ ఇప్పటికే ఖాలీ అయ్యేదన్న వదంతులున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితి నుండి బయట పడేందుకు రజతోత్సవ సభ బిఆర్‌ఎస్‌కు కలిసి వొచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో తన సత్తా చేయించుకోకపోతే ఇక ఆపార్టీ మనుగడే కష్టమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంటే వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్న బిఆర్‌ఎస్ రజతోత్సవసభ ఇప్పుడు ఆ పార్టీకి అత్యంత ప్రధానమైంది. ఆ పార్టీ భవిష్యత్ ఈ సభ విజయవంతంపైనే ఆధారపడి ఉందన్నమాట. అధికారంలోఉన్నప్పుడు, ఆ తర్వాతకూడా బిఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంలో బాగా నిర్లక్ష్యం చేసిందన్న భావనఉంది. పార్టీని అంటిపెట్టుకున్న పలువురు నాయకులకు పార్టీ పరంగా ఎలాంటి పదవులు లేకపోవడం కూడా శ్రేణుల్లో నిరాశ ఏర్పడింది. అయితే ఈ సభ దానికి మార్గదర్శి కాబోతుందనుకుంటున్నారు. అంతేగాక పదహారు నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు వ్యక్తిగతంగా ఎంత విమర్శించిన ఇంతకాలంగా మౌనంవహించిన కెసిఆర్ ఈ సభాముఖంగా ఎలాస్పందిస్తారన్న ఆసక్తికూడా రాష్ట్ర ప్రజల్లోఉంది. మొత్తానికి ఈ సభ బిఆర్‌ఎస్ భవిష్యత్‌ను నిర్దేశించేదిగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





