జైరాం వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– కాంగ్రెస్‌కు -‘ఎ’-టీమ్‌కాదు.. బీజేపీకి ‘బీ’-టీమ్‌ కాదు
– మాది తెలంగాణ ప్రజల ఏ-టీమ్‌’
– మీ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి
– కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: దేశ రాజకీయ్షాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భగ్గుమన్నారు. ఈమేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నిరంతర వైఫల్యాలకు ప్రధాన కారణం ఇదేనని ధ్వజమెత్తారు. మాకు మద్దతివ్వకపోతే మీరు బీజేపీ పక్షాన ఉన్నట్లే అనే అహంకారపూరిత వైఖరి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఒంటరిని చేసిందని ఆయన విమర్శించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల వైఖరిపై జైరాం రమేష్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. దేశం ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు రెండు ముక్కల దేశం కాదని స్పష్టం చేశారు. ‘జైరాం గారూ.. ఇలాంటి అహంకారమే మీ పార్టీని జాతీయ రాజకీయాల్లో విఫలం చేసింది.. మాతో ఉంటేనే మిత్రులు, లేదంటే వాళ్ల వైపు ఉన్నట్లే అనే వాదన అసమర్థనీయం అని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ‘ఎ-టీమ్‌’ కాదని, బీజేపీకి కూడా ‘బీ-టీమ్‌’ కాదని తేల్చి చెప్పారు. తాము తెలంగాణ ప్రజల ‘ఏ-టీమ్‌’ అని ఉద్ఘాటించారు. ప్రాంతీయ పార్టీలను రాజకీయ ఆటల్లోకి లాగే బదులు తమ పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాలపై దృష్టి పెట్టాలని జైరాం రమేష్‌కు హితవు పలికారు. భారత దేశ రాజకీయాలు కేవలం కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే నడుస్తున్నట్లు భావించడం వారి వైఫల్యాలకు మరో ఉదాహరణ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యతలు తెలంగాణ ప్రజలకు కోసమేనన్న కేటీఆర్‌.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు, ఆకాంక్షలు, వారి గొంతుకగా దిల్లీలో నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దిల్లీ రాజకీయ ఆటల్లో తాము భాగస్వాములం కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు చేయడం మానుకుని తమ పార్టీ పాలనాపరమైన, ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *