Kadana Bheri: బీఆర్‌ఎస్‌ కదనభేరి సభ మరోమారు వాయిదా

– భారీ వర్షాల నేపథ్యంలోనే అని ప్రకటన
– త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న గంగుల

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (reservations) అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ వేదికగా కదనభేరి (kadana bheri) పేరిట నిర్వహించతలపెట్టిన బీసీ గర్జన సభను (bc garjana sabha) మరోసారి వాయిదా వేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్‌ ఎమ్మెల్యే, పార్టీ నేత గంగుల కమలాకర్‌ తన ఎక్స్‌ ఖాతా వేదికగా ప్రకటన చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అందులో భాగంగా ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిందని వివరించారు. ఈ క్రమంలో ఈ కదన భేరి సభను వాయిదా వేసినట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత ఈ సభను నిర్వహించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందన్నారు. సభను మళ్లీ ఎప్పుడు నిర్వహించనున్నది మరికొద్ది రోజుల్లో నిర్ణయించి ప్రకటిస్తామని గంగుల తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు గమనించాలని సూచించారు. తొలుత 8వ తేదీన కరీంనగర్‌ వేదికగా ఈ కదన భేరీ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కానీ ఎందుకో ఈ సభను 14వ తేదీకి వాయిదా వేసింది. ఇపుడు భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు. ఇలా వాయిదాల పర్వం కొనసాగడానికి వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *