– సిద్దిపేట ఒకప్పుడు కరవు ప్రాంతం
– మిషన్ కాకతీయ ద్వారా ఇప్పుడు సస్యశామలం
– నేడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ
– యంత్రాలతో వ్యవసాయం లాభదాయకం
– మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది సబ్ స్క్రయిబర్ల తో రైతుబడి రాజేందర్ రెడ్డి రైతులకు రకరకాల పంటల మీద అవగాహన కల్పిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రి షో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లా పట్టుపురుగుల పెంపకంలో నంబర్-1 స్థానంలో వుందన్నారు. తీర ప్రాంతాల్లోనే పండే ఆయిల్ పామ్ ఇప్పుడు తెలంగాణలో పండుతున్నది. రైతు ఆదాయం పెంచడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించిందని గుర్తుచేశారు. సిద్ధిపేటలో ప్రస్తుతం 12000 ఎకరాల్లో సాగువుతున్న ఆయిల్ పామ్ వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందన్నారు. ఒకప్పుడు కరవు ప్రాంతం, సాగు నీరు కాదు కదా తాగు నీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడ్డ ప్రాంతంగా వుండేదని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను, కాలువలు తొవ్వించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరంతో కరువును పారదోలారన్నారు. ఇవ్వాళ దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ రూపొందిందన్నారు. రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు కూలీలది సమస్యగా మారింది. పంజాబ్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి నెలకొందన్నారు. బీహార్ నుంచి హమాలీలొస్తే కానీ మన కల్లాల్లో ధాన్యం ఎత్తే పరిస్థితి లేదు, మిల్లుల్లో దించే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది ఎలాగైనా మన రైతాంగాలకి అందించాలన్నారు. యంత్రాలను ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు. రెండున్నరేళ్ల కాలంలో అసలు ఎక్కడా వ్యవసాయ యంత్రాల మీద సబ్సిడీ అనేది లేకుండా పోయిందన్నారు. రైతులకు భరోసాను కల్పించింది కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. అమెరికాతో భారత ప్రభుత్వ ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్ట జరగబోతుంది. ఆ ఒప్పందంలో సోయా, మక్కలు, పత్తి లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా దిగుమతి కానున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాదులో ఎక్కువ పండించే సొయా రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈసారి మక్కలు ఎక్కువ పండిస్తున్నారు..ఆ రైతుల పరిస్థితి ఏంటి? మన రైతు పండించిన పంట ఖర్చు కంటే తక్కువకు అమెరికా మనకు దిగుమతి చేస్తే ఇక్కడి రైతు పరిస్థితి ఏంటి? 45 లక్షల కోట్ల విలువైన మక్కజొన్న, పత్తి, సోయా అమెరికా మనకు పంపిస్తే ఈ దేశ రైతులు ఏం కావాలి? విదేశాల నుండి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25% టాక్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ టాక్స్ 16% కు తగ్గించడం వల్ల ఇక్కడ 25000 ఉన్న పామ్ ఆయిల్ టన్ను రేట్ 21,000కు పడిపోయింది. ఈ టాక్స్ ఎందుకు తగ్గిస్తున్నారు? ఈ టాక్స్ తగ్గించడం వల్ల మనకు ఎం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ఒక ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని చేసినందుకు రాజేందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. పాసుబుక్కుకు 2 సంచులు అంటే పాస్ బుక్కులు లేని రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కొత్తగా భూములు కొనుకున్న వారికి పాస్ బుక్కులు రాక 8 నెలలు అయ్యింది. రైతు కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి 21 వచ్చినా ఇంకా రైతుబంధు రాలేదు. సకాలంలో రైతు బంధు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



