– 8 క్లస్టర్లలో 8బృందాలతో ఆయా ప్రాంతాల్లో పరిశీలన
– రేపటి నుంచి రెండు రోజులపాటు పర్యటన
– పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: గ్రేటర్ పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన నిజనిర్దారణ బృందాలను నియమించారు. ఈమేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్‌ఆర్‌ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం శ్మశానవాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో రెండు బృందాలు బుధ, గురువారాల్లో పర్యటించనున్నాయని, స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నామని చెప్పారు. వీటితోపాటు పారిశ్రామికవాడల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారన్నారు. క్లస్టర్-1లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనున్నది. క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. క్లస్టర్-3లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కూడిన బృందం మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లో పర్యటిస్తుందన్నారు. క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో, క్లస్టర్-5లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్-6లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్టియ్రల్ పార్కుకు వెళ్తారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పటోళ్ల కార్తిక్ రెడ్డిలు కాటేదాన్, హయత్‌నగర్‌లో పర్యటిస్తారు. క్లస్టర్-8లో మాజీ మంత్రి మహ్మూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎండీ సలీం, చందులాల్‌తో కూడిన బృందం బారాదరి పారిశ్రామికవాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారని కేటీఆర్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




