– అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మార్గనిర్దేశం
– రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడటంపై చర్చ
– ప్రజా ఉద్యమాలపై సమాలోచన
– ప్రకటనలో వెల్లడించిన పార్టీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: ఈనెల 19న బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు కె.సి.ఆర్. అధ్యక్షతన జరుగనున్నట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా కృష్ణా ,గోదావరి జలాల సమస్య, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరుగుతుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణ జలాలను కొల్లగొట్టడాన్ని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని పేర్కొంది. తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం-నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే. రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని విమర్శించింది. ఇంకా చెప్పాలంటే బీజేపీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నది. రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నారని ఆ ప్రకటన వివరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల నుంచి నీళ్లు అందేవి. పాలమూరు-రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలను కాపాడేవాళ్లం. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పుల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సాగునీరు రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ ఎన్నటికీ రాజీ పడబోదని స్పష్టం చేసింది. పై విషయాలతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఈనెల 19న నిర్వహించే సమావేశంలో కూలంకషంగా చర్చిస్తామని తెలిపింది. అందుకనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





