– ఉద్యోగస్తుల సమస్యలు పట్టించుకోవద్దా..
– విద్యార్థుల కడుపు నింపొద్దా..
– సభలో ప్రభుత్వం చెప్పే వినే ఓపిక లేదా?
– బీఆర్ఎస్ నేతలనుద్దేశించి భట్టి వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ప్రతివారికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని, వాటి చుట్టే తమ ప్రభుత్వ ఆలోచనలు తిరుగుతుంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకే సభకు వచ్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ· కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అగాధధంలోకి వెళ్ళొద్దని దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించామని చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతీ నిర్ణయాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ఉద్యోగస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి 1.20 కోట్ల ప్రమాద బీమాను దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ప్రవేశపెట్టాం. 7.50 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. మత, ప్రాంత భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఉద్యోగులకు ప్రమాద భీమా వర్తింపచేయడం ఇష్టం లేదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అని వదులుకొని ఉద్యోగులు పోరాడారు.. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని టీ(బీ)ఆరఎస్ నేతలు హామీ ఇచ్చారు.. రాష్ట్రం వచ్చాక మీ పదేళ్ల పాలనలో ఉద్యోగస్తులను నిర్బంధించారు, హౌస్ అరెస్టులు చేశారు.. ఉద్యోగులు భయం భయంగా బతికారన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంగా కూర్చున్న తనకు జరిగిన అవమానాలు ఏంటో రికార్డులు చూస్తే స్పష్టంగా తెలుస్తాయని, ప్రజల సమస్యలపై అడిగిన తనకు వారు మైక్ ఇవ్వలేదని, ఇది ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం.. నమ్మకం అని బీఆరఎస్ నేతలను విమర్శించారు. ప్రతీ ప్రశ్నకు సమాధానం, ప్రతి అంశానికీ క్లారిఫికేషన్ ఇస్తామన్నా వారికి వినే ఓపిక లేకుండా వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లు ఏనాడూ తమను సభ్యులుగా గౌరవించలేదని, అయినా అర్ధరాత్రి రెండు గంటల వరకు ఓపికగా ఉన్నామే తప్ప వాకౌట్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. అవకాశం ఇవ్వలేదని వెల్‌లోకి వెళ్లలేదు.. ఓపికగా సభలో ఉన్నాం.. కోట్లాది ప్రజల జీవనస్థితిగతులను మార్చాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాం.. ఎన్నికల తర్వాత మీరు అటు మేము ఇటు కూర్చుంటామని చెప్పాము.. అట్లాగే జరిగింది అని అన్నారు. లక్షలాదిమంది పేద విద్యార్థుల ఆకలిని అర్థం చేసుకున్న వ్యక్తులుగా ఏ బిడ్డా ఖాళీ కడుపుతో బడికి పోవద్దన్న ఆలోచనతో అల్పాహారం ప్రవేశపెట్టాం.. బడి నడిచిన ఆరు రోజుల్లో మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇంటర్ పిల్లలకు మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, వాళ్లు భోజనం చేయకూడదా, ఈ పథకం బిఆరఎస్ నేతలకు ఇష్టం లేదా.. ఈ విషయం వినడానికి వారికి ఓపిక లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం గురించి మీకు అవసరం లేదు.. మరి వారికి ఎవరు కావాలి.. ఏం కావాలి.. తాము ఇన్ని చేస్తుంటే వారు వినాలి కదా.. బీఆరఎస్ నేతలు మాట్లాడిన విషయాలను నమోదు చేసుకున్నాం సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చాం అంటూ వారు బడ్జెట్ కాగితాలను చింపి చెవిలో పూలు పెట్టుకుని వెళ్లిపోయారు అని ఎద్దేవా చేశారు.
బీìఆరఎస్ సభా నాయకుడు ఎలాగూ సభకు రారు.. వారికి సభపై ఎలాగూ గౌరవం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీఆరఎస్ నేతలకు కంటగింపుగా ఉందా? మేం బడ్జెట్ క్లారిఫికేషన్ ఇస్తే వారు వినకూడదా.. ఈ సభ ఉన్నది సమస్త తెలంగాణ ప్రజల కోసం.. వారి జీవితాల్లో మార్పు కోసం.. వారికి మాట్లాడ్డానికి ఏమీ లేదు కాబట్టి సభ నుంచి వెళ్లిపోయారు.. ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది.. ప్రజల జీవితాల్లో మార్పు కోసం పని చేస్తాం.. చులకన భావంతో చూడకండి.. వ్యక్తులుగా మేం చిన్నవాళ్ళం కావచ్చు కానీ ప్రజాస్వామ్య ప్రక్రియను మన్నించి వారు చర్చలో పాల్గొనాలి అని హితవు పలికారు. టిఆరఎస్ నేతల అహంకారాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు అలవి కాని హామీలు ఇచ్చామని హరీష్ రావు అన్నారు.. వాళ్ళలాగా అలవి కానీ హామీలు ఇచ్చుకుంటూ పోతే బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టాల్సి వచ్చేది. రైతు భరోసా, చేయూత, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్న ధాన్యానికి బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి పథకాల కోసం రూ.50 వేల కోట్లు కేటాయించాం.. రైతు భరోసా కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం.. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల కోసం వేసిన చరిత్ర మాది.. రైతు భరోసా స్కీమును ఎలక్షన్స్ స్కీముగా మార్చుకున్నది బీఆరఎస్ నేతలు.. 2018 ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి వెళ్ళినప్పుడు రైతు భరోసా డబ్బులు పడిన సౌండ్ వచ్చింది.. దాన్ని ఎలక్షన్స్ స్కీమ్‌గా మార్చారు.. హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును బీìఆరఎస్ నేతలు ఎన్నికల ముందు కుదువబెట్టి వచ్చిన డబ్బులను ఎన్నికల ముందు రైతుబంధు పేరిట రైతుల ఖాతాల్లో జమ చేశారు.. రాష్ట్రంలో 46% మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు.. రైతుల సంక్షేమం మా ఆలోచన. సన్న ధాన్యం సాగు చేసే రైతులకు రూ.500 బోనస్‌గా ఇస్తామని చెప్పాం.. మిగిలిన పంటలు ఎవరైనా సాగు చేస్తే వారిని ప్రోత్సహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. వ్యవసాయాన్ని పండుగలా చేశాం.. ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్.. ఉచిత కరెంటు పథకం దేశానికి దిశా నిర్దేశం చేశాం.. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ పాలన సాగిస్తున్నాం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం.. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెబుతాం. అది ప్రజల పట్ల, పజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
శాసనసభ నడుపుతున్న తీరును నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానాన్ని వినకుండా బిఆరఎస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసింది. సకాలంలో పద్దుల పుస్తకాలు ఇవ్వలేదు. పదిహేను నిమిషాలు టీ బ్రేక్ అని సభను వాయిదా వేస్తూ కొన్ని గంటల తర్వాత గానీ సభను ప్రారంభించడం లేదు. ప్రతి రోజూ సభను ఆలస్యంగా మొదలుపెడుతున్నారు.. వీటన్నిటికి నిరసనగానే తాము సభ నుంచి వాకౌట్ చేశాము అని సభా ఉప నాయకుడు టి.హరీష్‌రావు తెలిపారు. తాము వాకౌట్ చేసి బయ{కు వచ్చాకనైనా తమ తప్పులు సవరించుకుంటామని ప్రభుత్వం ఒక్క మాటైనా చెప్పలేదు. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షమంటే కనీస మర్యాద లేదు. కనీసం లోపలికి రావాలని పిలవాలనే సంస్కారం అధికార పక్షానికి లేకుండా పోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




