– నీటి హక్కుపై మాట్లాడే నైతికత ఆ పార్టీకి లేదు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో రాష్ట్ర నీటి హక్కుల విషయంలో చారిత్రక ద్రోహానికి పాల్పడిందే బీఆర్‌ఎస్ అని విరుచుకుపడ్డారు. తత్ఫలితంగా దక్షిణ తెలంగాణ రైతాంగం నీటి కొరతతో పడరాని పాట్లు పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం జానపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ సోమవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈఎన్‌సి జనరల్ రమేష్‌బాబుతోపాటు జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కృష్ణా నది సాక్షిగా చెబుతున్నా.. నదీ జలాల అంశంలో తెలంగాణకు చెందాల్సిన నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నీటిపారుదల రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, ధాన్యం దిగుబడిలో నమోదైన రికార్డు అందుకు అద్దం పడుతుందని అన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జలాల విషయంలో చేసిన తాత్కాలిక ఏర్పాట్లలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు విభజిత ఆంద్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టిఎంసిలలో 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులకు ఒప్పందం కుదుర్చుకున్నారని, అంటే విభజిత ఏపీకి 512 టిఎంసిలు, తెలంగాణాకి కేవీపీ 299 టిఎంసిల కేటాయింపులకే ఆ ప్రభుత్వం అంగీకరించిందని విమర్శించారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఇదే అంగీకారానికి ఆమోదముద్ర వేసిన బీఆర్ఎస్ పాలకులు తెలంగాణా రైతాంగాన్ని ఎడారిపాలు చేశారని మండిపడ్డారు. వీటన్నింటినీ అధ్యయనం జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలలో రాష్ట్రానికి న్యాయబద్ధంగా చెందాల్సిన వాటా గురించి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్(ఖఔణు-2)తోపాటు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం వద్ద బలమైన వాదనలు వినిపిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దశాబ్దా కాలంగా అధికారంలో ఉన్న బీఆరఎస్ పాలనతో పోల్చి చూస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలను అధికంగా వినియోగించుకున్నామని, దాంతో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి పెరిగిందని ఉత్తమ్ గణాంకాలతో వివరించారు. 2028 నాటికి కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడం ప్రభుత్వం ముందున్న కర్తవ్యమన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే కల్వకుర్తి ఎత్తిపోతల పధకం సహా భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్, పాలమూరు-రంగారెడ్డి, ఎసఎల్‌బిసి, డిండిలతోపాటు చిన్నతరహా ఎత్తిపోతల పధకాలన్నింటినీ పూర్తి చేసి వ్యవసాయానికి సమృద్ధిగా సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన 15వేల ఎకరాలకు సాగునీరందించే రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథóŠకం పనుల పురోగతిని సమీక్షించారు. అదేవిధంగా సవరించిన అంచనాల ప్రకారం జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పధకం ద్వారా 15 గ్రామాలకు చెందిన 10 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు సురక్షితమైన తాగు నీరు లభిస్తుందన్నారు. వచ్చే మే నాటికి ఈ పథకం పూర్తి అయితే సుమారు 2,000–3,000 మంది రైతులకు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గిరిజన సముదాయాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం నాగార్జున సాగర్ నుండి నీటిని ఎత్తిపంపుతూ ప్రధాన ఆనకట్ట నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదలైన నీటిని పునర్వినియోగం చేస్తుందని వివరించారు. ఈ లిఫ్ట్ కింద రైతులకు రెండు పంటలకు సాగునీటి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పాలకీడు, జనపహాడ్, బొట్లపాలెం, కొమటికుంట, గుండెబోయినగూడెం, అలింగాపురం, మేఘ్నాపహాడ్ తండా, చెరువు తండా, రాఘవాపురం, ఎల్లాపురం, సజ్జాపురం, నాగిరెడ్డిగూడెం, హనుమంతగూడెం తదితర సుమారు 10-13 గ్రామాలు ఈ లిఫ్ట్ ద్వారా లాభపడనున్నాయి. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.నాగార్జున సాగర్ వ్యవస్థ వంటి ప్రాజెక్టుల ఆధునీకరణలో భాగంగా ఈ పథకం అమలవుతోందని, నీటి విషయంలో జరిగిన చారిత్రక నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ నీరు చివరి అంచు ప్రాంతాల వరకూ చేరేలా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





