– సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన ఎన్టీఆర్
– పథకాల అమలులో ఆయనే మాకు స్ఫూర్తి
– ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్ దిమ్మెలను కూలగొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించిన సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్దులపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పేదవాడికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని, ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదÁని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పాలనలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితోనే పేదలకు సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదలకు సంక్షేమం అందించడమే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని అన్నారు. 2007లో మొదటిసారిగా తాను మధిర నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నానని, అప్పుడే స్నానాల లక్ష్మీపురం వెళ్లి మల్లు భట్టి విక్రమార్కను ఆయన స్వగ్రామంలో చూశానని గుర్తుచేసుకున్నారు. ఈ ఇరవై సంవత్సరాల్లో తానెప్పుడు వచ్చినా ప్రజలు ప్రేమాభిమానాలు పంచారన్నారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటానికి ప్రజలు ఇచ్చిన సహకారం మరవలేనిదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్నేరు-పాలేరు లింక్ వేగంగా పూర్తి చేస్తాం: ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వానివి రైతుల అనుకూల విధానాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రూ.162.54 కోట్లతో చేపట్టిన మున్నేరు-పాలేరు లింక్ కాలువను వేగంగా పూర్తి చేసి 2027 జనవరిలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలో జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మున్నేరు నది వరద నీటిని 9.6 కి.మీ. కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించే పథకమని ప్రశంసించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. సంవత్సరంలో ఈ లింక్ కాలువును పూర్తి చేసి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనాలు అనే సూత్రంతో ప్రాజెక్టు చేపట్టామన్నారు. పాలేరు కింద నాగార్జునసాగర్ ప్రాజెక్‌్ట (ఎన్‌ఎస్‌పీ) కాలువతో 1.38 లక్ష ఎకరాలు (ఖమ్మం జిల్లా), పైన 40 వేల ఎకరాలు (సూర్యాపేట జిల్లా) నీటిపారుదలకు స్థిరీకరణ ఏర్పడుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఫేజ్-2కు (56 వేల-76 వేల ఎకరాలు), సీతారామ లిఫ్‌్ట ఇరిగేషన్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ)కు విద్యుత్ బిల్లులో ఏటా రూ.120 కోట్ల ఆదా అవుతుందని తెలిపారు. పాలేరు పవర్ ప్లాంట్‌లో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవడమేగాక ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వరద ప్రమాదాలు తగ్గుతాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. అంతేకాక 4.7 టీఎంసీ నీటిని మిషన్ భగీరథకు కేటాయించి ఈ జిల్లాల్లో తాగునీటి సమస్య తీరుస్తామని చెప్పారు. ఎస్‌ఆర్‌ఆర్‌ఐపీని వేగవంతం చేస్తామని, నాల్గవ పంప్ హౌసు నిర్మాణంలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఈ కాలువ ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ రైతుల జీవితాలను మార్చివేస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





