‌వివస్త్రైన వివక్ష

తల లేని మొండెంగా ఉండటం నాకు చేతకాదు!
తలపు రాని మెదడున్నా – లేనట్టే!

సమాజపు అరాచకత్వానికి అంగలారుస్తూ శవమై పోలేను,
అసమానత్వానికి పుట్టిన సంతానమై సాగలేను.

కాలు మీద కాలేసుకుంటే,
ధగధగ మెరిసే బట్టలేసుకుంటే,
గురువై గమనాలు నేర్పుతుంటే –
మా వృద్ధి చూసి మీ గుండెగుత్తి ఎందుకని మండిపోతోంది?
వేల గొంతుకల్తో విజృంభిస్తూ –
నా మేనికి అంటిన మీ ఆంక్షల చిట్టా విప్పుతాను!
కలగాపులగంగా పడివున్న నా దైన్యాన్ని కళ్లెమ్మట కడుగుతాను!

స్త్రీని దైవమనే ఈ దేశాన,
మా జాతి ఆడాళ్ళ పైనే
ఈ అఘాయిత్యాల ఆగడాలెంతకాలమని,
వేగులెత్తిన నిప్పుకణికనై దహిస్తాను!

నింగికి చేతులు చాచి,
నేలని అడుక్కోవటమంటే – అసహ్యం నాకు,
నిర్భాగ్యపు నిస్సహాయతలో కొట్టుమిట్టాడక చావలేను,
ఊపిరి బిగబట్టి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ –
కొన ఊపిరిలో కూడా కృపాణంగా మారి సమరం సాగిస్తాను

ఓ నాడు నా మైలంతా మీకు పులిమేసి,
మీరు పుట్టించిన ‘‘ముట్టు’’ తోనే మిమ్ముల బొందలో పాతేసి – వేగుచుక్కనవుతాను

నిత్యం వివక్షల్లో విలవిల్లాడిన నా ఆయువు,
ఇంకా ఏ కాంతి పుంజంలో ఆవిరౌతుంది?

-బాలాజీ పోతుల, (మ్యాథ్స్ ‌టీచర్‌)
8179283830, ‌నారాయణఖేడ్‌, ‌సంగారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *