– వరుడి బంధువులపై వధువు బంధువుల దాడి
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 7: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడి చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి పెళ్లికొడుకుకు వరుసకు బాబాయి, పిన్ని వరుసలైన వడిత్య హేమ్లా, బుజ్జి కారణమన్న అనుమానంతో పెళ్లికూతురు తరపువారు హేమ్లా ఇంటికి వచ్చి కత్తులు, కర్రలతో దాడిచేయడంతో కత్తిపోట్లకు గురయ్యాడు. అతడిని గ్రామస్థులు ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. కూసుమంచి మండలం లోక్యాతండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా వున్నాయి. లోక్యాతండాలో ఆ గ్రామ ఆచారం ప్రకారం మూడురోజల పాటు హోలీవేడుకలు జరిగాయి. అందరూ సంబరాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ఓ యువతి, అదేతండాకు చెందిన ఉపేందర్ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇద్దరి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఎలాగైనా పారిపోయి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం అందరూ హోలీ వేడుకల్లో ఉన్న సమయంలో గ్రామం నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టుకున్నారు. వాటిని చూసిన గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇక తమకూతురు పెళ్లికి.. వరుడికి బాబాయి వరుసైన వడిత్య హేమ్లా, అతడి భార్య బుజ్జి కారణమని అనుమానించి.. యువతి తరపు బంధువులు హేమ్లా ఇంటిపై దాడికి వెళ్లారు హేమ్లా కత్తిపోట్లకు గురవడంతో ఖమ్మం తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. వడిత్య బుజ్జి ఫిర్యాదుమేరకు దాడిచేసిన జర్పుల సాయిచరణ్, తేజావత్ నాగేంద్రబాబు, జర్పులహరిదాసు, జర్పుల నాగమణి, జర్పుల మస్తాన్, జర్పుల విజయ, మూడ్ బుజ్జి తదితరులపై హత్యయత్నం కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.