జూన్ 2 నుంచి పాఠశాలల్లో అల్పాహారం

– ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
– ప్రతీ బిడ్డ విద్యకి ఏ లోటూ లేకుండా చూస్తాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బోనకల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఏ ఆయుధమూ తెలంగాణ బిడ్డలను నిలబెట్టలేదంటూ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని బాగా చదువుకుని ఉన్నత స్థితికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులకు ఉద్బోధించారు. అక్షరం ద్వారానే అంతరాలు లేని ఆదర్శ సమాజం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బోనకల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిళ్లను గురువారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (ఎస్ఈఈఈపీసీ) సర్వేలో కూడా ఇది స్పష్టమైందని తెలిపారు. అర్ధాకలితో బడికి వెళ్లే విద్యార్థి చదువుపై ఏకాగ్రత చూపలేడనేది దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 20 లక్షల మంది విద్యార్థులకు జూన్ 2 నుంచి అల్పాహార పథకం ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని, ఇది వృధా కాకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతీ బిడ్డ తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు సౌకర్యాలు కల్పించాలని, అద్భుతమైన మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దాలని విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్థిక వసతులు లేక, తల్లిదండ్రులు సహాయం చేయలేక చదువుకోలేకపోయాం అనే బాధ ఏ బిడ్డకూ ఉండొద్దనే ఉద్దేశంతో కార్పొరేట్ వసతులతో కూడిన విద్యను ఉచితంగా అందించాలని అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ బోధన, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అక్కడే ఉండేలా క్వార్టర్లు సైతం నిర్మిస్తున్నామని, అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా, ఒక వసుదైక కుటుంబ భావన కలిగేలా వీటిని నిర్మిస్తున్నామని వివరించారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెమీ రెసిడెన్షియల్ విధానంలో ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తున్నామని ఆయన ప్రకటించారు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు గ్రామానికి వచ్చే ప్రైవేటు పాఠశాల బస్సులో తమ పిల్లలను పంపేందుకు ఆర్థికంగా భారానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి వారికి చేయూతనిచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ స్కూల్స్ వాహనాలు ఉదయాన్నే గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొస్తాయని, పాఠశాలకు రాగానే అల్పాహారం, వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగి జావ వంటి పోషక పదార్థాలు అందిస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజనం, విద్యాబుద్ధులు నేర్పడం, పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్ల వద్ద ఉచిత బస్సులో దింపనున్నట్లు తెలిపారు. ఈ స్కూల్స్‌లో క్రీడా, కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి ఆధునిక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో తనకు తెలిసిన మిత్రులతో మాట్లాడి అమ్మ ఫౌండేషన్ ద్వారా బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేపట్టినట్టు భట్టి విక్రమార్క తెలిపారు.

విద్య కోసం 13.5 శాతం నిధులు : ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం

విద్యార్థుల భవిష్యత్తు, వారి ఎదుగుదలే రాష్ట్ర సంపూర్ణ ఎదుగుదలగా భావించి బడ్జెట్‌లో విద్యా శాఖకు 13.5 శాతం నిధులు కేటాయించి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఎర్రుపాలెంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లపాటు విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచలేదని, ప్రజా ప్రభుత్వం రాగానే ఆర్థిక భారం అయినప్పటికీ డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. మన సహజ వనరులు, మన మానవ వనరులను వజ్రాలుగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో నిలపాలని కోరారు. విద్యార్థుల సమయం విలువైనదని, దాన్ని ఆదా చేయడంతోపాటు, వారికి శ్రమ ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు భట్టి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *