ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే బడుల్లో అల్పాహారం

– కామ‌న్ స్కూల్ విధానమే ఉత్త‌మం
– స‌మాజం ఉమ్మ‌డి కుటుంబంలా ఎదుగుతుంది
– గొప్ప నాయ‌కుల‌ను ఇచ్చిన మొగిలిగిద్ద స్కూల్‌
– డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తున్న‌దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామంలో ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ప్రారంభించామన్నారు. మా సంకల్పం గొప్పది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, అన్ని వనరులు సమకూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుంది. చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయాం అనే భావన కులం, మతం, ధనిక , పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్న‌దని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు.  పాఠశాల నిర్వాహకులు పిలవగానే గత సంవత్సరం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి పది కోట్లు కేటాయించారని వివరించారు. ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐ లను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు.

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆద్యుడు బూర్గుల అని, రు. దివంగత ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ  గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హరగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల సమాజానికి అందించిందని తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల అని తెలిపారు. ముఖ్యమంత్రిగా 1950- 54 మధ్యకాలంలో కౌలుదారీ చట్టం తీసుకువచ్చి సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించి దేశంలో భూసంస్కరణలకు బూర్గుల ఆధ్వర్యంలో నిలిచారని తెలిపారు. దేశంలో 1970లో తీసుకువచ్చిన భూ సంస్కరణల చట్టానికి బూర్గుల బాధ్యుడిగా నిలిచారని తెలిపారు. సాయుధ పోరాటం వంటి సమస్యలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చూపిన మహానేత బూర్గుల అని వివరించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాల గొప్పది ఈ పాఠశాలలో  1952 వరకు ఉర్దూ మీడియం లో కొనసాగగా, ఆ తరువాత తెలుగు మీడియాను ప్రవేశపెట్టారని వివరించారు. 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని పట్టుబట్టి ప్రవేశపెట్టారన్నారు. భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మాత్తుగా స్థానికంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో, వసతి గృహంలో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వసతి గృహంలో బోధన, బోధనేతర అంశాలపై నిర్వాహకులను ప్రశ్నించి పలు విషయాలు ఆరా తీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *