– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం జరిపారు. తొలి పూజల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురార్పణ జరిగాయి. 19న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ, 20న ఉదయం మత్సావతార అలంకారం, సాయంత్రం శేష వాహన సేవ వేదపారాయణలు, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ, 21న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, 22న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహనసేవ చేపడతారు. 23న ఉదయం గోవర్ధనగిరి ధారి, సాయంత్రం సింహ వాహన సేవ, 24న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనంపై రాత్రి ఎదుర్కోలు వేడుక చేస్తారు. 25న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న రాత్రి 8 గంటలకు దివ్య విమాన రథోత్సవం, 27 న చక్రతీర్థ స్నానం, 28న గర్భాలయంలోని మూలవరులకు సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





