ఆ ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే

– కడియం, దానంలకు క్లీన్‌చిట్
– వారు పార్టీ మారినట్లు ఆధారాల్లేవు
– తుది తీర్పు వెలువరించిన స్పీకర్ ప్రసాదరావు
– తీర్పును స్వాగతించిన దానం, కడియం
– రేపు సుప్రీంలో కేసు తుది విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును స్పీకర్ మొత్తంగా కొట్టివేశారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్ఎస్‌లో ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. నాగేందర్, శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారు కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నారని, వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరఎస్, బీజేపీ నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తుది తీర్పును ప్రకటించారు. తాజా విచారణలో తాము ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. వీరిద్దరినీ బీఆరఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అనర్హత వేటు పిటిషన్లను కొట్టేశారు. దీంతో వారిద్దరికీ ఊరట లభించినట్లయ్యింది. ఇదిలాఉంటే గురువారం సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం కేసు మళ్లీ విచారణకు వచ్చేలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని సూచించింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. ఇప్పటికే 8మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్ప్పుడు మరో ఇద్దరికి క్లీన్ చిట్ ఇవ్వండతో మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పదిమంది కాంగ్రెస్‌లో చేరారు. అయితే టెక్నికల్‌గా ఇది రుజువు కాకపోవడంతో దీనిని స్పీకర్ తిరస్కరించారు. ఈ క్రమంలో సుప్రీం విచారణలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *