ఖాలీ కాకముందే బుకింగ్స్

– సిలిండర్ల సరఫరాపై నిబంధనలు
– కట్టెలను ఆశ్రయిస్తున్న గృహస్థులు, హోటల్ నిర్వాహకులు
– గ్యాస్ దొరక్క మూతపడుతున్న హోటళ్లు, హాస్టళ్లు

నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులుంటే హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే డిమాండ్ కు సరిపడ కమర్షియల్ సిలిండర్లు లేకపోవడం, సరఫరా చేసే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రభావం గృహ కనెక్షన్లపైనా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎల్‌పీజీ కొరత లేదని అధికారులు చెబుతున్నా కొరత ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్లు బుక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈక్ర మంలో బుకింగ్ ల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నది. గత నాలుగు రోజులుగా రోజుకు 25వేల పైచిలుకు బుకింగ్ అవుతున్నట్టు ఆయా గ్యాస్ కంపెనీల ఏజెన్సీల ద్వారా తెలుస్తున్నది. గతంలో ఒక సిలిండర్ పూర్తయిన తర్వాత బుక్ చేసుకునేవారు. ప్రస్తుత సిలిండర్ ఖాలీ కాకముందే ముందు జాగ్రత్తగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతు న్నా రు. అయితే డిమాండ్ కు అనుగుణంగా గ్యాస్ సరఫరా లేక బుక్ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సరఫరా విషయంలో ఇప్పటికే కంపెనీలు, ఏజెన్సీలు పలు నిబంధనలు పెట్టాయి. ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్న వారు 21 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని, అలాగే రెండు సిలిండర్లు ఉన్న వారు 30 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆ ప్రకారం బుక్ చేసినా సీరియల్ సంఖ్యనుబట్టి డెలివరీ ఉంటుందని చెబుతున్నా యి. ఈ నిబంధన ఉమ్మడి కుటుంబాలు, ఎక్కువ సభ్యులున్న కుటుంబాలకు ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేదని, కానీ, నిబంధనలు మాత్రం అమలు చేయక తప్పదని ఉమ్మడి జిల్లాలోని పౌరసరఫరా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇంకా వీలైనంత ఎక్కువ విక్రయించడానికి ఇన్నాళ్లూ ఆయా కంపెనీలు బంకు యజమానులకు వివిధ రకాల స్కీంలను అమలు చేశాయి. కానీ, మూడు రోజులుగా ఆ స్కీములను ఎత్తివేశాయి. దీనికి కారణం ఆయా కంపెనీలు వీలైనంత మేరకు.. డీజీల్ విక్రయా లను తగ్గించే దిశగానే ఆలోచనలు చేస్తున్నా యన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలను డీజిల్ కొరత వెంటాడు తున్నది. వాహనాలపై కూడా ఇప్పుడిప్పుడే ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలానే ఉంటే మరో మూడు నాలుగురోజుల్లో డీజిల్ ప్రభావం ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని యజమానులు చెబుతున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ చము రు సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి. గ్యాస్ కనెక్షన్దారులకు స్వయంగా మెసేజ్ లు సైతం పంపిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. అవసరాని కి తగిన మొత్తంలో సిలిండర్ల సరఫరా ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో కాసులకు కక్కు ర్తి పడుతోన్న గ్యాస్ ఏజెన్సీలు భిన్నంగా ప్రవర్తి స్తున్నాయి. కొరత ఉందంటూ ప్రచారం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఎల్పీజీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సిలిండర్ బుకింగ్ చేసేందుకు క్యాష్ మాత్రమే తీసుకుం టుండటం అనుమానాలకు తావిస్తోంది. వారం క్రితం వరకు ఎల్పీజీ సిలిండర్ ధర రూ.928.50 ఉండగా రూ.60 పెంపుదలతో రూ.988కి చేరింది. సిలిండర్ అత్యవసరం కావడంతో రూ.వేయి వెచ్చిస్తున్న ప్పటికీ సిలిండర్లు ఇంటికి చేరడం లేదు. ఇంట్లో పొయ్యి వెలిగించడమే గగనమైంది. సిలిండర్ బుక్ చేసేందుకు కొరత పేరుతో రూ.50 నుంచి రూ.100 వరకు గ్యాస్ ఏజెన్సీలు వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ చేసుకున్న తర్వాత ఇంటికి సిలిండర్ చేర్చేందుకు సైతం సతాయిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉందంటూ తప్పించుకుంటుండడంతో అదనంగా డబ్బులు ఇచ్చిన వారికే సరఫరా చేస్తున్నట్లు విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరా భారీగా క్షీణించింది. చమురు సంస్థల నుంచి డిమాండ్ కు  సరిపడ రాకపోవడంతో హోటళ్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. వ్యా పారాలు బంద్ చేసుకుని మిన్నకుండిపో తున్నారు. హోటళ్లు మూత పడటంతో ఉపాధి దెబ్బతిని కార్మికులు విలవిల్లాడుతున్నారు. మరోవైపు వివాహాల సీజన్ కావడంతో వాణిజ్య సిలిండర్ల కొరత ప్రభావం సెగలు పుట్టిస్తోంది. కట్టెల వంటపైనే వివాహాల్లో భోజనాలు రెడీ చేస్తున్నారు. ఒక్కసారిగా కట్టెలకు డిమాండ్ పెరుగుతుండటంతో వాటి ధరలు సైతం పెరిగినట్లుగా తెలుస్తోంది. కిరాయి ఇంట్లో జీవనం సాగించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *