– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు
– మోదీ ఒక యోగి: వకుళాభరణం
– నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు పుస్తకావిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా, “శ్రీ నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు” పేరుతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన ఈ పుస్తకాన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రచురితమైంది. మోదీ రాజకీయ ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, సామాజిక న్యాయం పట్ల కట్టుబాటు, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట, గ్రామీణాభివృద్ధి దిశగా ఆయన చేసిన కృషి ఇందులో విపులంగా వివరించారు. పుస్తకావిష్కరణ అనంతరం ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ 75వ జన్మదినోత్సవం సందర్భంలో మోదీ పరిపాలనలోని విశేషాలను గుర్తు చేసుకోవడం గర్వకారణమన్నారు. జీఎస్టీ సంస్కరణలు, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయన్నారు. మోదీ 75 ఏళ్ల జీవన యాత్ర దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ పుస్తకం మోదీ నాయకత్వాన్ని అధ్యయనం చేయదలచిన వారికి విలువైన ఆధారం అవుతుంది” అని అన్నారు. డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ – “మోదీ కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఒక దార్శనికుడు, ఒక యోగి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనానికే అంకితం. మోదీ 75 ఏళ్ల జీవన యాత్ర దేశానికి స్ఫూర్తిదాయకం. వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. బలహీన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమం, అభివృద్ధి, సమానత్వం అనే మూడు సూత్రాలను ఆయన పాలనలో సమన్వయం చేశారు. అందుకే నేను ఈ పుస్తకాన్ని మూడు భాషల్లో సిద్ధం చేసి, ఆయన దూరదృష్టిని, ఆలోచనలను విస్తృత పాఠక వర్గానికి చేరవేయాలనుకున్నా. ఆయన 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం నాకు గౌరవం” అని అన్నారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ సీనియర్ నేత చింతా శంభామూర్తి, ఓబీసీ నేత మారుతి ప్రసాద్, దివాకర్ తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





