ప్రశాంత వాతావరణంలో బోనాలు

– 13న సీఎం రేంవత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు
– ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ఉజ్జయిని మహంకాళి బోనాలకు వొచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ బోనాల సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వొచ్చే లక్షలాదిమంది భక్తుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 13న తెల్లవారుమున 3 గంటల నుంచే బోనాలు సమర్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమేకాక, వివిధ ప్రాంతాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నామన్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు జీహెచ్‌ఎంసీ వాటర్‌ వర్క్స్‌అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కాగా, ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోనాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన తలసాని ఆమెతో మాట్లాడారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

ఈనెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్‌ పోలీసులు సూచించిన మార్గంలోనే వాహనదారులు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం నుంచి 15 వరకు సికింద్రాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలతోపాటు వైన్స్‌ కూడా మూసిచేయాలని పోలీసులు ఆదేశించారు. 13న సీఎం రేవంత్‌ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్‌, దేవాదాయ శాఖ, పోలీస్‌, జీహెచ్‌ ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లష్కర్‌ బోనాలు చరిత్రాత్మక మైనవని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా జరుపుకుంటారు. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలతో నగరంలో అథ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. గోల్కొండ, లాల్‌ దర్వాజ, ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *