హస్తినలో ధూంధాంగా లాల్‌ దర్వాజ బోనాలు

విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి

న్యూదిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో లాల్‌ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. గవర్నర్‌ జిష్ణు వర్మ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్‌ నుండి తెలంగాణ భవన్‌ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాంస్కృతిక నృత్యాల మధ్య సింహవాహిని ఆలయ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించారు. తొలుత కమిటీ సభ్యులు ఇండియా గేట్‌ వద్ద అమ్మవారి ఘటాలకు ప్రత్యేక వూజలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ముఖ్య అతిథిóగా హాజరయ్యారు. అనంతరం 150మంది సాంస్కృతిక శాఖ కళాకారుల సంప్రదాయపూర్వక డప్పుల మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు కళాకారుల నాట్యాలు, పూర్ణ కుంభాల మధ్య సాగిన అమ్మ వారి ఘటాల ఊరేగింపు ఇండియా గేట్‌ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతోపాటు అక్కడకు వచ్చిన విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షించింది. పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో బంధించడమే కాదు, తెలంగాణ కళారూపాలపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇండియా గేట్‌ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో బోనాల ఊరేగింపును నిర్వహించడం తమకు గర్వకారణమన్నారు. తెలంగాణ పౌరులు మాత్రమే కాక ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులకూ మన సంస్కృతిని పరిచయం చేసే అవకాశం కలిగిందన్నారు. 2వ తేదీ(చివరి రోజు) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పణ, సంప్రదాయ పూజలు జరుగుతాయని, కార్యక్రమానికి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారని వారు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల ముగింపు ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *