పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

పోలీసుల హైఅలర్ట్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, కర్నాటకలోని బెంగళూరు అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.
ముందుగా దిల్లీలో 20 పాఠశాలలకు హెచ్చరికలు వచ్చాయి. తొలుత రోహిణి సెక్టార్‌-3లోని అభినవ్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఈ బెదిరింపు మెయిల్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తర్వాత పశ్చివమ్‌ విహార్‌లోని రిచ్‌మాండ్‌ గ్లోబల్‌ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ పాఠశాలకు మూడు రోజుల్లో రెండుసార్లు ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులకు కూడా ఈ మేరకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. వారం రోజుల వ్యవధిలో దిల్లీ స్కూళ్లకు ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది నాలుగోసారి.

కర్నాటకలో కూడా..

బెంగళూరు నగరంలో కూడా శుక్రవారం ఉదయం సుమారు 40 పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్స్‌ వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాలకు బాంబు డిస్పోజల్‌ బృందాలను పంపారు. వీటిల్లో చాలావరకు రాజేశ్వరినగర్‌, కెంగెరీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దిల్లీలో హెచ్చరికలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇక్కడా అవే హెచ్చరికలు రావడం గమనార్హం. ఇవన్నీ ఒకే ఐడీ నుంచి వచ్చాయి. కాగా, మూడు రోజుల క్రితం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజిని పేల్చివేస్తామని కామ్రేడ్‌ పినరయి విజయన్‌ పేరుతో ఉన్న మెయిల్‌ ఐడీ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఈ బెదిరింపు సందేశం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *