దిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద భారీ పేలుడు

– 9మంది మృతి?
– ప‌లువురికి గాయాలు
– ఎర్ర‌కోట మెట్రోస్టేష‌న్ వ‌ద్ద కారులో విస్ఫోటం
–  5 వాహ‌నాలు ద‌గ్ధం..  క‌కావిక‌ల‌మైన జ‌నం
– కీల‌క ప్రాంతాల్లో మ‌రింత‌ భ‌ద్ర‌త పెంపు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10:  దేశ రాజధానిలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1  వెలుప‌ల దిల్లీ గేట్ నుండి కాశ్మీరీ గేట్ వైపు వెళ్లే రద్దీగా ఉండే మార్గంలో సోమ‌వారం సాయంత్రం జరిగిన భారీ కారు పేలుడు నగరాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ సంఘ‌ట‌న‌లో తొమ్మిదిమంది మ‌ర‌ణించిన‌ట్టు, ప‌లువురు గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి పార్క్ చేసిన ఇతర వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. పేలుడు సంభవించిన కారుతో పాటు మొత్తం 3 నుంచి 5 వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా ధ్వంసమయ్యాయి. పర్యాటకులతో నిండిపోయిన ఈ ప్రాంతం అకస్మాత్తుగా నల్లని పొగలతో, మంటలతో, పరుగులు తీసే ప్రజల అరుపులతో ఒక్క‌సారిగా క‌కావిక‌ల‌మైపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల తరువాత కొద్దిసేపటికే స్టేషన్ గేట్-1 సమీపంలోని పార్కింగ్ జోన్‌లో నిలిపివున్న ఒక తెలుపు రంగు కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. సాక్షుల ప్రకారం పేలుడు శబ్దం 300–400 మీటర్ల దూరం వరకు వినిపించి, కారులో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రభావంతో పక్కన ఉండే మరో మూడు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా వివరించాడు. “మేమంతా స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా చెవులు పగిలేంత శబ్దం వినిపించింది. కారు గాల్లో ఎగిరినట్టే అనిపించింది. వెంటనే మంటలు ఎగిసిప‌డ్డాయి. ప్రజలు అటూ ఇటూ పరుగులు తీశారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి హుటాహుటిన చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటళ్లకు తరలించారు. ఒకరు కారులోనే చిక్కుకుని తీవ్రంగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో వెంటనే మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళాలు 15 నిమిషాల్లో అక్కడికక్కడే ఉన్న 7 ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి. పోలీసులు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాలీ  చేయించగా, మెట్రో స్టేషన్‌లోని గేట్-1ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులను ఇతర గేట్లు, ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించారు. సాయంత్రం  సమయంలో  రద్దీ త‌క్కువ‌గా ఉండటం వ‌ల్ల‌ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటన తర్వాత ఎన్ ఎస్‌జీ  బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీములు, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరి శాంపిళ్లు సేకరించాయి. పేలుడు స్వభావం వల్ల ఇది సాధారణ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని అధికారులు భావిస్తున్నారు.దర్యాప్తు అధికారులు మూడు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు ముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని, జైష్-ఎ-మహ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాద మాడ్యూల్‌ను ఫరీదాబాద్‌లో ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 29,00 కిలోల బాంబు తయారీకి సంబంధించిన పదార్థాలు, ఆయుధాలు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట పేలుడు ఘటనపై మరింత అప్రమత్తతతో దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి, ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణంపై,  అధికారిక మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
దిల్లీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పేలుడుకి ఖచ్చితమైన కారణం ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదు. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ఇది సాధారణ ప్రమాదం కావచ్చనే అవకాశం కూడా ఉంది, కానీ ఉద్దేశపూర్వక పేలుడు కోణాన్ని విస్మరించట్లేదు” అని తెలిపారు. ఇంత సున్నితమైన ప్రదేశంలో పేలుడు జరగడంతో ఢిల్లీ పోలీసులు నగరమంతటా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా లాల్‌కిల్లా పరిసర ప్రాంతాలు, జామా మసీదు, చాందినీ చౌక్, ప్రధాన మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు, త‌దిత‌ర కీల‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అదనపు సీసీటీవీ ఫుటేజీలు సేకరించటం, వాహనాల తనిఖీలు చేప‌డుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల క‌ద‌లిక‌ల‌పై నిఘాను క‌ట్టుదిట్టం చేశారు.
ఎర్రకోట ప్రాంతం సాధారణంగా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులతో నిండి ఉంటుంది. నేడు కూడా భారీ రద్దీ ఉంది. అదృష్టవశాత్తూ పేలుడు పార్కింగ్ ప్రాంతంలో జరగడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు. ఈ ఘటన మెట్రో ప్రవేశ ద్వారం వద్ద జరిగితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన పెరిగింది. కొంతమంది ఇది ఉగ్రదాడి ప్రయత్నమై ఉండొచ్చని పోస్టులు పెట్టగా, పోలీసులు నిరాధార ప్రచారాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. మృతుని వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. కుటుంబానికీ  పోలీసులు సమాచారమిచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గాయపడిన వారిలో ఒకరు అక్కడి సమీప దుకాణంలో పనిచేసే ఉద్యోగి, మరొకరు మెట్రో ప్రయాణికుడని స‌మాచారం. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్-1 వద్ద జరిగిన కారు పేలుడు దిల్లీ  నగరంలోని భద్రతా వ్యవస్థలకు పెద్ద హెచ్చరికలా మారింది. కారణం స్పష్టంకానప్పటికీ నగరం అంతా అలర్ట్‌లో ఉంది. ఈ ఘటన మరోసారి ప్రజా ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను పునఃపరిశీలించేలా చేసింది.

తాజా వివరాలు 
* మరణాల సంఖ్య (ధృవీకరించబడినది): లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) హాస్పిటల్ వైద్య పర్యవేక్షకులు మరియు  దిల్లీ
పోలీసుల ధృవీకరణ ప్రకారం, ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. మరో 20 నుండి 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
* ఘటన స్వభావం: ఈ పేలుడు అధిక తీవ్రత (High-Intensity) కలిగినదని, మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో రెడ్ లైట్ వద్ద నెమ్మదిగా కదులుతున్న Hyundai i20 కారులో సంభవించిందని దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ధృవీకరించారు.
* నష్టం: పేలుడు ధాటికి ఆ కారుతో పాటు సుమారు 5 నుండి 8 ఇతర వాహనాలు (కార్లు, ఆటోరిక్షాలు) దగ్ధమై, పూర్తిగా ధ్వంసమయ్యాయి.
* దర్యాప్తు స్థితి:
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా దిల్లీ పోలీస్క మిషనర్‌తో మాట్లాడారు, ఆపై LNJP హాస్పిటల్ సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
* ఎన్ఐఏ (NIA), ఎన్ఎస్‌జీ (NSG), దిల్లీ స్పెషల్ సెల్ మరియు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించాయి.
* అన్ని కోణాల్లో దర్యాప్తు: హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “ఎలాంటి అవకాశాన్నీ తోసిపుచ్చడం లేదు” అని ప్రకటించారు, దీని వెనుక ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
* ఘటనా స్థలం నుండి బుల్లెట్ (లైవ్ బుల్లెట్) లభించిందనే కోణంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* భద్రత: ఈ ఘటన నేపథ్యంలో దిల్లీ , ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
* అదుపులో అనుమానితులు: ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.
అధికారికంగా పేలుడుకు కారణం (టెర్రర్ అటాక్ లేదా ఇతర కారణం) ఇంకా ప్రకటించబడలేదు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *