– మహిళా సంఘాలతో సోలార్ విద్యుదుత్పత్తి.. దేశానికే దశ దిశ
– ఇందిరా మహిళా డెయిరీలో సభ్యులే వాటాదారులు
– మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి
మధిర, ప్రజాతంత్ర, జనవరి 19: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్యతరగతి మహిళల కోసం ఎంతటి ఆర్థిక భారాన్నైనా మోసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు. మహిళలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఇండస్ట్రియల్ పార్కులలో మహిళలకు ప్రత్యేకంగా బ్లాకులు కేటాయిస్తామని, మధిర పట్టణం సమీపంలో ఇండస్ట్రియల్ పార్కులో మహిళల ద్వారా ప్రత్యేకంగా పరిశ్రమలు పెట్టిస్తానని భట్టి హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించి వారి ద్వారా విద్యుదుత్పత్తి చేయించి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికే దిశానిర్దేశంగా నిలుస్తుందని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇందిరా క్రాంతి పధ్యం అనే పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు రుణాలిచ్చే సౌకర్యం కల్పించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన వనరులను మనమే వినియోగించుకోవచ్చు.. పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని మహిళలు ఆశించారు.. కానీ గత పదేళ్లు పరిపాలించిన వారు ఈ పథకాన్ని పక్కన పడేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం తిరిగి వచ్చాక ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాలివ్వాలని నిర్ణయించి ముందుకు పోతున్నామని తెలిపారు.
మధిరలో ఎన్జీవోల ద్వారా శిక్షణ ఇప్పించి ఎవరు ఏ వ్యాపారం చేసుకోవాలో సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేశామని భట్టి చెప్పారు. చెక్కులు తీసుకున్న మహిళలు త్వరలోనే చెక్కులు రాసి ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం మధిర పట్టణంలో 589 సంఘాల్లో 5,688 మంది సభ్యులుగా ఉన్నారని, మరో ఐదువేల మంది సభ్యులుగా చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గంలో 53 వేల మంది సభ్యులుంటే అందులో 45 వేల మంది ఇందిరా మహిళా డెయిరీలో సభ్యులుగా చేరేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాలు పోసే ఒక ఆదర్శవంతమైన డెయిరీనీ నియోజకవర్గంలో ప్రారంభించుకున్నాం.. ఈ పరిశ్రమలో మహిళా సంఘాల సభ్యులే వాటాదారులని తెలిపారు. ఒక్కో మహిళకు రెండు గేదెలు ఇప్పిస్తున్నాం.. పాల సేకరణ, పాల అనుబంధ ఉత్పత్తుల తయారీ, విక్రయం అన్నీ సంఘ సభ్యుల ద్వారానే జరుగుతాయని భట్టి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





