– ప్రపంచ నగరాలతో రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు
– 2047కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యం
– మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. పట్టణంలోని 9వ వార్డు మన్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నందున ప్రజా ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతోందని తెలిపారు. 2047కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామన్నారు. విద్య, వైద్యం మౌలిక వసతుల మేలు కలయిక ఈ ప్రణాళికలో ఉంటుందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా దిల్లీ, కలకత్తా వంటి నగరాల్లో నివసించడమే కష్టం అవుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గాలి నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో ఆదాయం కోల్పోతున్నప్పటికీ బ్యాటరీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో మురుగు నీటిని శుభ్రం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎస్టీపీలను నిర్మిస్తున్నామన్నారు.
నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం
ఆక్రమణదారుల నుంచి చెరువులకు విముక్తి కల్పించి పార్కులు, చెరువులను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఉత్పత్తికి ప్రధానమైన విద్యుత్తు సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, గ్రామీణ ప్రాంతాల యువత పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రాల్లోని ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ పొందేందుకు అంబేద్కర్ నాలెడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో దేశంలోని ప్రముఖ లెక్చరర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. స్కిల్స్ ఉంటేనే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయంటూ అందుకోసం నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పామని తెలిపారు. పేద బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో విద్యనందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





